కోడికత్తి కేసుకు సంబంధించి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు తాను హాజరు కాలేనని చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనను, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవాల్సి ఉందన్నారు.2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి దాడి కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్డులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కోర్టులో తాజాగా సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో సీఎం జగన్ కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణ ఉందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలపై సమీక్షలు ఉన్నాయని సీఎం జగన్ పిటిషన్‌లో వివరించారు. తాను కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకోసమే అడ్వొకేట్ కమిషనర్‍ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదుకు అభ్యర్థించాలన్నారు. లేదా వీడియో కాన్ఫరెన్స్, ఇతర మార్గాల ద్వారా సాక్ష్యం నమోదుకు వీలు కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు లోతుగా జరపాలని సీఎం జగన్ మరో పిటిషన్ కూడా వేశారు. సీఎం జగన్ పిటిషన్లపై ఈ నెల 13వ తేదీన విచారణ జరుపుతామని ఎన్‍ఐఏ కోర్టు వివరించింది.
జగన్ రావాల్సిందే: న్యాయవాది సలీం
పౌరులకు కూడా హక్కులు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది సలీం అన్నారు. ముఖ్యమంత్రి అయినా.. ప్రధాన మంత్రి అయినా రూల్ ఆఫ్ లా పాటించాల్సిందే అని అన్నారు. కోర్టుకు సీఎం జగన్ రావాలి.. సాక్ష్యం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 13న తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని.. ఈ కేసులో సీఎం జగన్ బాధితుడిగా ఉన్నందున తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయవాది అన్నారు.