Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

చంద్రబాబు కోసమే ఉమ్మడిగా పోటీ చేస్తామంటున్నారు..

పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి పేర్ని నాని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం అవసరం వచ్చిందనే ప్రతిపక్షాలన్నీ కలిసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని ఆరోపించారు. మంగళవారం రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మచిలీపట్నం వేదికపై చేసిన ఆరోపణలకు మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ పేరు ఎత్తకుండా ‘ఓ మహానుభావుడు’ అంటూ సంబోదిస్తూ విమర్శలు కురిపించారు.తన బాస్‌ చంద్రబాబుకు అవసరం వచ్చిందనే రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ఈ మహానుభావుడు ప్రకటించారని అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పోటీచేయాలని, అప్పుడే వారి నిజస్వరూపాన్ని ప్రజలు గుర్తుపడతారని చెప్పారు. వైసీపీ పార్టీ కూడా అదే కోరుకుంటోందని తేల్చిచెప్పారు. 2014 నుంచి 2019 వరకు అందించిన పాలననే మళ్లీ ఇప్పుడు అందిస్తామని ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా అని మంత్రి సవాల్‌ చేశారు. కులరహిత రాజకీయాలంటూనే మళ్లీ కాపుల కోసం పనిచేస్తున్నానని అంటున్నారని విమర్శించారు. కాపులకు ఎవరేం చేశారనేది అందరికీ తెలుసని చెప్పారు. కాపులందరమూ కలిసి చంద్రబాబును ఆశ్రయిద్దామని అంటున్నారని.. కాపులు మాత్రం జగన్‌ వెంటే ఉన్నారని మంత్రి తేల్చిచెప్పారు. కాపుల్లో 60 శాతం మంది జగన్‌ వెంటే ఉన్నారని, ఉంటారని, ఇకపైనా ఉండబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలనూ మంత్రి విమర్శించారు. 2019లో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నది ఈ మహానుభావుడేనని, మరి ప్రజారాజ్యం పార్టీ రాజకీయ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం పెట్టిన తన అన్న చిరంజీవినీ పరోక్షంగా ఎత్తిపొడుస్తున్నాడని మండిపడ్డారు. తన కుటుంబంలో తను తప్ప ఇంకెవ్వరూ రాజకీయాల్లో లేరని పవన్‌ చెప్పడాన్ని తప్పుబట్టారు.ఆ మహానుభావుడి మాటలన్నీ గందరగోళమేనని, ఓసారి తనకు డబ్బులు అక్కర్లేదని అంటాడని, మరోసారి డబ్బులు అవసరమయ్యే సినిమాలు చేస్తున్నానని అంటాడని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలు చేసి ఒక్కో సినిమాకు పదిహేను కోట్లో పద్దెనిమిది కోట్లో తీసుకున్నానని ఇటీవలే చెప్పిన సదరు మహానుభావుడు మళ్లీ నిన్న మాటమార్చాడని చెప్పారు. సినిమా షూటింగ్‌ కు రోజుకు రెండు కోట్లు తీసుకుంటానని అన్నాడని మంత్రి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img