సహకార రంగంలో రెండంచెల విధానం తేవాలి
ఆర్‌బీఐ మార్గదర్శకాలు అమలు చేయాలి
ఇది రైతులకు, ఉద్యోగులకు మేలు
ఇష్టానుసారంగా డీసీసీబీ చైర్మన్ల నియామకం
సహకార రంగ ఉద్యోగులకు అండగా ఉంటాం
మహాధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఆర్‌బీఐ ఆదేశాలు భేఖాతరు: ఏపీ సీసీబీఈఏ
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా, తక్షణమే సీఎం జగన్ దిగివచ్చి సహకార రంగంలో రెండంచెల విధానం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ కో
ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీ సీసీబీఈఏ) అధ్వర్యంలో సహకారరంగం, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై మహాధర్నా నిర్వహించారు. దీనికి ఏపీసీసీబీఈఏ కార్యనిర్వాహక అధ్యక్షులు వై.ప్రతాప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్ఛేసిన రామకృష్ణ మాట్లాడుతూ, సాధారణంగా ఉద్యోగస్తులు వారి ప్రయోజనాలు, డిమాండ్ల సాధన కోసమే ధర్నాలు చేస్తారన్నారు. సహకార రంగానికి చెందిన ఉద్యోగులు మాత్రం ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఆశించకుండా, రెండంచెల విధానం కోసం ఉద్యమించడాన్ని స్వాగతించారు. ఈ డిమాండ్‌పై ఇవాళ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది సహకార రంగ ఉద్యోగులు ఒకే వేదికపైకి వచ్చి ధర్నాలు చేయడం పట్ల సీపీఐ తరపున అభినందించారు. ఈ విధానం తీసుకొస్తే, ప్రభుత్వంపై ఎలాంటి ఖర్చు ఉండబోదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 13 ఉమ్మడి జిల్లాల్లో 13 డీసీసీబీ చైర్మన్లను చేశారని, వారిలో చాలా మందికి సహకార రంగంపై అవగాహన లేదన్నారు. జగన్ రాజకీయ వ్యవహార శైలి విలక్షణంగా ఉంటుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు హయాంలో డీసీసీబీ చైర్మన్లను అర్హత గల వారికీ, రైతాంగానికే కేటాయించే వారని చెప్పారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చున్ని, సహకార రంగంపై ఎలాంటి అవగాహన లేని వారికి పదవులు కేటాయించడంతో, ఈ దుస్థితి నెలకొందన్నారు. ఇవాళ ధర్నా జరగబోదంటూ వైసీపీ శ్రేణులే సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఏమిటని, ఎందుకు అంత దిగజారాలని ప్రశ్నించారు. రెండంచెల విధానాన్ని ఒక్క సహకార రంగ నేతలే కోరడం లేదనీ, ఆర్‌బీఐ సైతం ప్రభుత్వానికి తగిన సూచనలిచ్చిందన్నారు. గతంలో ఏ పోరాటం జరిగినా, కో`ఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ముందుండేదని ప్రశసించారు. ఈ యూనియన్ అనుకున్నది సాధించి తీరుతుందని, ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, డిమాండ్లు సాధించేంత వరకు ఉద్యోగులు ఉద్యమబాట పట్టాలని, వారికి సీపీఐ అండగా నిలుస్తుందన్నారు. సీఎం జగన్, సంబంధిత శాఖ మంత్రి తక్షణమే స్పందించి సహకార రంగంలో రెండంచెల విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, రెండంచెల విధానంతో రైతులపై పడే భారం తగ్గుతుందన్నారు. గతంలో సహకార రంగం బలోపేతం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని, టీడీ జనారన్థన్ నేతృత్వంలో సహకార రంగాభివృద్ధికి చర్యలు చేపట్టారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి.రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, రెండంచెల విధానం అటు రైతాంగానికీ, ఇటు ఉద్యోగులకూ రెండు విధాలా మేలు చూకూరుతుందన్నారు. సీఎం జగన్ స్పందించి ఈ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు, మార్పులు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు, సహకార రంగంలో ఉన్న రైతులకు ఉద్యోగస్తులకు ఉపయోగపడేలా ఉన్నప్పుడు స్వాగతిస్తామన్నారు. వారిరువురికీ నష్టదాయకంగా ఉండి, ప్రభుత్వం ఏదో దుర్భిద్ధితో నూతన విధానాలు అమలు చేస్తే ప్రతిఘటించాలని కోరారు. ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షులు కాటమయ్య మాట్లాడుతూ, పెన్షన్ విధానం లేకుండా ఉద్యోగులు విధులెలా నిర్వహిస్తారనీ ప్రశ్నించారు. రెండంచెల విధానం ఉద్యోగులు, రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
రెండంచెల విధానంతో బ్యాంకుల వ్యవస్థ పటిష్టం: తోట రామారావు
ఏపీసీసీబీఏ చైర్మన్ తోట రామారావు మాట్లాడుతూ, రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల్లో భాగంగా, బ్యాంకుల వ్యవస్థ పటిష్టత కోసం రెండంచెల విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏపీసీసీబీఈఏ వర్కింగ్ ప్రెసిడెంట్ వై.ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీఎస్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ, రెండంచెల సహకార వ్యవస్థ ఆవశ్యకత, లాభాలను వివరించారు. ఈ విధానంతో రాష్ట్ర స్థాయి పాలకవర్గం ఆజమాయీషీలో బ్యాంకు శాఖల విస్తీర్ణం వేగవంతంగా చేపట్టవచ్చన్నారు. ఏఐసీబీఈఎఫ్ చైర్మన్ ఏవీ కొండారెడ్డి మాట్లాడుతూ, సహకార బ్యాంకులను, సహకార సంఘాలను కంప్యూటరీకరించడం ద్వారా, ఆధునిక సాంకేతిక పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని చెప్పారు. రిజర్వు బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపగా, వాటిని పక్కన పెట్టిందన్నారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఏపీటీబీఈఎఫ్ కార్యదర్శులు వర్మ, బి.బాబు, కృష్ణాడిస్ట్రిక్ బ్యాంక్ ఎంప్లాయీస్ సమన్వయ కమిటీ కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఏపీపీఎఏ సీఎస్‌ఈఏ న్రపధాన కార్యదర్శి నీలం నాగేశ్వరరావు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, కృష్ణా యూనిట్ ప్రెసిడెంట్ కొండలు శర్మ, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.వెంకటసుబ్బయ్య తదితరులు ప్రసంగించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్, నాయకులు ఆర్.పిచ్చయ్య అభ్యుదయ గీతాలను ఆలపించారు. వివిధ జిల్లాల నుంచి సహకార బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.