లోకేశ్ యువగళం పాదయాత్రకు నేడు 29వ రోజు
చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగిన పాదయాత్ర
టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముందుకు సాగుతోంది. 29వ రోజు (సోమవారం) యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో కొనసాగింది. చంద్రగిరిలో స్థానిక ప్రజలనుంచి లోకేశ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించి జయజయధ్వానాలు చేశారు. శానంబట్ల గ్రామంలో కొంతమంది డాక్టర్లు సంఫీుభావం తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు తమకు స్పూర్తిదాయకంగా నిలిచాయని అన్నారు. చంద్రగిరిలో ఉత్సాహంగా పాదయాత్ర చేసిన లోకేశ్… పట్టణంలోని ఒక ఇరానీ టీ సెంటర్లో టీ తాగి అక్కడి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.జగన్ పాలనలో రాష్ట్రానికి అన్నీ అరిష్టాలేని లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాకు స్టీల్ ఫ్యాక్టరీ లేదని విమర్శించారు. అప్పర్ తుంగభద్రకు రూ.5,300 కోట్లను కేంద్రం కేటాయిచిందని, అప్పర్ తుంగభద్ర పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమకు చంద్రబాబు అనేక కంపెనీలు తీసుకొస్తే… జగన్ రెడ్డి వాటిని రాష్ట్రం నుండి తరిమేస్తున్నాడని లోకేశ్ ఆరోపించారు. ‘‘చంద్రబాబుకు, జగన్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే. జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి. జగన్ రెడ్డి పాలనలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు… ఫ్యాక్షనిస్టు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది’’ అని విమర్శించారు. ‘‘అమర్ రాజా బ్యాటరీ కంపెనీని మన రాష్ట్రం నుండి జగన్ రెడ్డి తరిమేశాడు… తెలంగాణ మంత్రి కేటీఆర్ అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాడు. ఈ కంపెనీ మన రాష్ట్రం నుండి పోవడం వల్ల 20వేల మంది మన యువకులు ఉద్యోగాలు కోల్పోయారు’’ అని వివరించారు.