ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించేందుకు వెళ్లిన దేవినేని
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌బాబును కలిసేందుకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పోలీసులు అరెస్టు చేయడం అలజడి రేపుతోంది. అశోక్ బాబును కలిసేందుకు దేవినేని ఉమ సహా కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యరావు, సుఖవాసి, కనపర్తి తదితరులు వెళ్లారు. పోలీసులు అడ్డుకున్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనతోపాటు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. మరోవైపు, ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ’’ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఈ రోజుకీ ప్రజాపాలనపై దృష్టిపెట్టకుండా కక్షసాధింపులకే పరిమితమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ కుట్రలపై ధ్వజమెత్తినందుకే అశోక్ బాబు అరెస్ట్. ఇలాంటి అక్రమ అరెస్టులు ఎల్లకాలం కొనసాగించలేరు. జగన్ నియంతృత్వ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని సోమిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా, అశోక్ బాబును తప్పుడు కేసులో ఇరికించారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.