Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

తీవ్రరూపం దాల్చుతోన్న అల్పపీడనం..ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోంది. దీని ప్రభావం ఒడిశా, ఏపీలోని కోస్తాంధ్ర తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి నైరుతి దిశగా వంగి ఉంది. నేటి రాత్రిగానీ, రేపటిలోగా ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఢల్లీిలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం కొన్ని చోట్ల రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
తెలంగాణలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న 12 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప రెండు మూడు రోజులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతుండటంతో తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ..
దక్షిణ కోస్తాలో నేడు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ప్రజలను హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img