మూడు నెలలైనా సమీక్షలు లేవు
ఉన్నత విద్యామండలిలో గ్రూపు తగాదాలు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఉన్నత విద్యామండలి ప్రక్షాళన ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న వారికే కీలక పదువులు కట్టబెట్టడంతో ఈ దుస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. అధికారులు రెండు గ్రూప్‌లుగా విడిపోయి... ఇష్టానుసారం కార్యకలాపాలు కొనసాగించడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు భావిస్తున్నారు. దీనికితోడు ఉన్నత విద్యామండలి ప్రక్షాళనపై ఇంతవరకు ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమూ ప్రధాన కారణంగా తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించాక ఉన్నత విద్యామండలిని ప్రక్షాళన చేస్తామని ప్రకటించినప్పటికీ... ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మంత్రి లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యార్థి, యవనజన సంఘాల నేతలు కలిసి అనేక సమస్యలు విన్నవించారు. ప్రతి అంశాన్ని ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలతో చర్చించి, మెరుగైన విద్యా విధానం తీసుకొస్తామని, విద్యావ్యవస్థ ప్రక్షాళనకు కృషి చేస్తామని లోకేశ్ భరోసా ఇచ్చారు. ఉన్నత విద్యామండలి అధ్వర్యంలో నిర్వహించే ప్రవేశాల విధానం గందరగోళంగా మారింది. దీని అధ్వర్యంలో యేటా నోటిఫికేషన్ జారీజేసి... వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 2024
25 విద్యా సంవత్సరానికిగాను ఏపీఈఏపీసెట్ 2024, ఈసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్ తదితర 11 విభాగాల్లో వెబ్ కౌనెల్సింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టి… వరుసవారీగా సీట్లు ఖరారు చేస్తారు. పండుగ, సెలవు దినాల్లోనూ వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిన డిగ్రీ, పీజీ విద్యార్థులు స్వయం నివేదికల షెడ్యూలు ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఆ సమయంలో స్వయం నివేదికలు సమర్పించని విద్యార్థులంతా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఉపాధ్యాయ అవార్డుల్లో అవకతవకలు
ఉపాధ్యాయ అవార్డుల్లోను అనేక అవకతవకలు జరిగాయి. దీనిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేయాల్సిన అవార్డులను అనర్హులకు కేటాయించినట్లుగా తెలిసింది. గత ప్రభుత్వ మద్దతుదారులకు అనుకూలంగా వ్యవహరించిన హేమచంద్రారెడ్డి విధానాలతోనే అవార్డుల విధానం పక్కదారి పట్టినట్లు విమర్శలున్నాయి. కృష్ణా యూనివర్సిటీకి చెందిన అర్హతలేని వారికి అవార్డులు ఇవ్వడంతో వ్యతిరేకత నెలకొంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఇన్‌చార్జి వైస్ చైర్మన్ కె.రామ్మోహనరావు, కార్యదర్శి నజీర్ అహ్మద్ తీసుకుంటున్నారు. ఇందుకు నిదర్శనమే ఉన్నత విద్యామండలి వారానికి ఐదు రోజులకు బదులు ఆరు రోజులు కొనసాగుతుందని ఉత్తర్వులు జారీజేయడమే. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
ప్రక్షాళన చేయాలి: ఏఐవైఎఫ్
ఉన్నత విద్యామండలిని తక్షణమే ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జి చైర్మన్ కె.రామ్మోహనరావు, కార్యదర్శి నజీర్ అహ్మద్‌తో ఉద్యోగులకు తీవ్రనష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఉపాధ్యాయ అవార్డుల్లో జరిగిన అవకతవకలపైనా సమగ్ర విచారణకు ఆదేశించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని… ప్రస్తుతం కొనసాగుతున్న వారిని విధుల నుంచి తొలగించాలని కోరారు. సెలవు రోజుల్లో వెబ్ కౌన్సెలింగ్‌లో స్వీయ నివేదికలు సమర్పించే విధానాన్ని పక్కనపెట్టాలన్నారు.
ఉన్నత విద్యామండలి కార్యాలయాల్లో గ్రూప్‌లు లేకుండా, మంచి వాతావరణం ఉండేలా చూడాలని, లేకుంటే విద్యా వ్యవస్థపై దాని ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. సెలవులు, పండుగ దినాల్లో విద్యార్థులు స్వయం నివేదికలు ఇచ్చేలా షెడ్యూలు విధించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.