ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాను ఎటువంటి తప్పు చేయలేదని తాజాగా స్పష్టం చేశారు. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదన్న ఆయన.. టిక్కెట్ కేటాయింపుల్లో తన అసంతప్తిని మాత్రం వెళ్లగక్కారు. ఉదయగిరిలో తనకు మించిన బలమైన నాయకుడు మరొకరు లేరని తేల్చి చెప్పారు. జగన్ తనకు టిక్కెట్ ఇవ్వనన్నారని, అందుకే బాధపడ్డానని మేకపాటి వివరించారు. ఈ ఒక్కసారి టిక్కెట్ ఇవ్వమని జగన్‌ను అప్పట్లో కోరినట్టు కూడా తెలిపారు. తాను సూచించిన అభ్యర్ధికి మద్దతివ్వమని జగన్ కోరారని, అయితే.. నియోజకవవర్గంలో తాను తప్ప మరెవరూ గెలవలేరని సమాధానమిచ్చినట్టు వెల్లడిరచారు. రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి తాను ఉదయగిరి అభ్యున్నతి కోసం పాటుపడ్డానన్నారు. తన పనులేవీ జరగలేదన్న ఆయన జగన్ ప్రభుత్వంలో తానేమీ ప్రత్యేకంగా లాభపడలేదన్నారు. జగన్‌తో ఏం చెప్పినా ఉపయోగం లేదని బాధపడి బయటకు వచ్చేశానన్నారు. సజ్జల తనపై తప్పుడు కేసులు పెట్టించబోయారని సంచలన కూడా కామెంట్ చేశారు. పార్టీ నుంచి తననెవరూ సస్పెండ్ చేయలేదన్న ఆయన, తానే స్వయంగా పార్టీ వీడినట్టు తేల్చి చెప్పారు. ప్రజల మద్దతున్న నేతను ఎన్నుకుంటే పార్టీ బాగుపడుతుందని చెప్పారు. తానేమీ టీడీపీ నేతలతో సంప్రదింపులు జరపలేదన్న ఆయన వారు వస్తే మాత్రం తాను చర్చిస్తానన్నారు. తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే గెలిచేది ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు పోటీగా ఎవరైనా రావచ్చని సవాల్ విసిరారు.