Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ప్రజా సమస్యలపై రావిశాస్త్రి రచనలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ

విశాలాంధ్ర బ్యూరోవిశాఖపట్నం: విశాఖలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావిశాస్త్రి శత జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం జిల్లా పరిషత్‌ జంక్షన్‌ సమీపంలో ఉన్న అంకుశ హాలులో జరిగిన కార్యక్రమంలో సీజే ఎన్‌.వి.రమణ మాట్లాడుతూ రావిశాస్త్రి తన రచనల్లో ప్రజా సమస్యలను, అలాగే సరిగా రాయని, అమలుకాని చట్టాలను ప్రస్తావించారని తెలిపారు. మాండలికాలను నిలబెట్టిన దిట్ట అని కొనియాడారు. ఆయన తన రచనలతో తెలుగువారిని ప్రభావితం చేశారని చెప్పారు. విశాఖలో ప్రశాంత వాతావరణం ఉందని, ఇక్కడి ప్రజలకు విశాల హృదయం ఉందని అన్నారు. ఒక సాహితీ వేత్తగా కాకుండా సాహిత్యాన్ని అభిమానించే వ్యక్తిగా వచ్చానని సీజే తెలిపారు. చాలా సుసంపన్నమైన కవితా మూర్తులను కన్నది విశాఖ అని, వచ్చే దారిలో నా ఫ్లెక్స్‌ హోర్డింగ్‌లు పెట్టడం నాకు బాధ కలిగించిందన్నారు. ఆ స్థానంలో రావిశాస్త్రి కవితలో వారి ఫొటోలు పెట్టి ఉంటే బాగుండేదన్నారు. సమాజంలో గిరీశంలు పెరిగిపోయారని, తెలుగు భాషను కాపాడుకోవాలంటే మాండలికాలను కాపాడుకోవాలన్నారు. రావిశాస్త్రి రచనలలో వస్తువులు సమాజంలో ప్రజలు, వారి ఇబ్బందులని అన్నారు. న్యాయవ్యవస్థ కోసం చక్కగా రావిశాస్త్రి కవితలో సీజే చెప్పారు. వారం వారం వచ్చే రత్తాలురాంబాబు సంపుటి కోసం ఎదురు చూసేవాళ్లమని అన్నారు. విశ్వ విద్యాలయం ఒక సామాజిక ప్రయోగ శాలని, అక్కడ నేర్చుకున్నదే ఎన్ని అటు పోటులు వచ్చినా ఎదుర్కొని నిలిచేలా చేసిందని తెలిపారు. న్యాయ వ్యవస్థ కోసం ఆరు సారా కధలను చదివితే అర్ధం చేసుకోవచ్చు నన్నారు. అందుకే ఆరు సారా కథల పుస్తకాలు అచ్చు వేసి ఇచ్చానని సీజే చెప్పారు. రావిశాస్త్రి పార్లమెంట్‌ కోసం, శాసనసభ కోసం కథలో చక్కగా చెప్పారని, మన రాజ్యాంగం కోసం అందరికీ అర్ధం అయ్యేలా తన కథలలో, రచనలో చెప్పారన్నారు. సమాజంలో వ్యవస్థల పై ప్రజలకు నమ్మకం పోతే ఏమవుతుందో రచనలో తెలిపారని అన్నారు. సరిగ్గా రాయని చట్టాలు, అమలుకాని చట్టాల కోసం చెప్పారన్నారు. ఈ మధ్యనే 124(ఏ) చట్టాన్ని కూడా రద్దు చేశామన్నారు. దశాబ్దాల క్రితం ఒక రావి గౌతముడుని ప్రభావితం చేసిందన్నారు. ఈ శతాబ్దంలో రావి ఒక్కరే సమాజాన్ని ప్రభావితం చేశారన్నారు. రావిశాస్త్రి రచనలను ఆంగ్లంలో తర్జుమా చేయాలని కోరిక ఉందని అన్నారు. ఎవరైనా ముందుకు వస్తే నేను ఆ పని చేయాలని అనుకుంటున్నానని సీజే చెప్పారు. రావిశాస్త్రి విశాఖ పై ఉన్న ప్రేమను యారాడ కొండ పై రచన చేసి చాటుకున్నారని అన్నారు. తన పదవీ విరమణ తర్వాత రావిశాస్త్రి, శ్రీశ్రీ వారి సాహిత్య కార్యక్రమాలు చేస్తానన్నారు. విశాఖ ప్రజలకు సముద్రమంత విశాల భావాలు ఉంటాయని, ప్రశాంతమైన విశాఖలో నివాసం ఉండాలని ఎక్కడెక్కడో ప్రజలు ఇక్కడ స్థిరపడుతున్నారని తెలిపారు. రావిశాస్త్రి రచనలకు ప్రభావితమై తాను జీవన శైలి నేర్చుకున్నానని, రావిశాస్త్రి పేదల పక్షాన నిలిచిన న్యాయవాది అని సీజే ఎన్‌.వి.రమణ కొనియాడారు. తెలుగువాడు కావడం వల్లే రావిశాస్త్రికి ప్రపంచ స్థాయి గుర్తింపు రాలేదన్న బాధ ఉందని, నా ఉద్యోగం గొప్పది కావచ్చుకానీ రావిశాస్త్రి గారి కంటే తక్కువేనన్నారు. విశాఖలో కొన్ని ప్రధాన ప్రాంతాల్లో రావిశాస్త్రి సూత్రాలు ఏర్పాటు అవసరమన్నారు. ఉత్తరాంధ్ర మాండలికంలో రావిశాస్త్రి రచనలు ఈ ప్రాంతం విశిష్ఠత పెంచాయని, మంచి, చెడు, మోసకారి తనం, పీడిత తనం రావిశాస్త్రి రచనల్లో కనిపించిందన్నారు. లోకంలో పాపం పుణ్యాలు లేవని, వ్యాపారం మాత్రమేనని రావిశాస్త్రి చెప్పిన మాటల్లో ఇప్పటికీ నిజం ఉందని తెలిపారు. భాష లేనిదే బతుకు లేదని, అందువల్ల తెలుగు భాషను కాపాడాలని, తెలుగులో మాట్లాడాలని, పిల్లలకు తెలుగు పుస్తకాలు ఇచ్చి చదివించాలని విజ్ఞప్తి చేశారు. ప్రారంభ సభలో రావిశాస్రి రచనలు నేటి యువతకు మార్గదర్శకమని హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు అన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన చేసి, రావిశాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాచకొండ రచన కవిత్వంలో భాష, భావం, శిల్పం, బాపు కథ కనిపిస్తుందన్నారు. నేటి ఆధునిక యుగంలో యువత ఫేస్‌బుక్‌ వైపే చూస్తున్నారు తప్ప ఫేస్‌ బుక్కుల వైపు చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. యువత రాచకొండ రచనలు చదవడం చాలా అవసరం అన్నారు. రాచకొండ కథలలో ఉత్తరాంధ్ర మాండలికం ఉంటుందని, రావి భావాలు లేజర్‌ కన్నా పదునుగా ఉంటాయన్నారు. అంతకుముందు సీనియర్‌ జర్నలిస్టు మంగు శివరాం ప్రసాద్‌ రాసిన ‘వందేళ్ల రావికి వందనం’ పుస్తకాన్ని న్యాయమూర్తి ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సభకు డాక్టర్‌ రఘునాథరావు అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో ఆచార్య సిమ్మన్న, రాంబట్ల నరసింహ శర్మ, డాక్టర్‌ జీకే వేణు, డాక్టర్‌ వి.కృష్ణమూర్తి, రావిశాస్త్రి కుమారుడు ఉమకుమార శాస్త్రి, కుమార్తె పార్వతితో పాటు సాహిత్యకారులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img