సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
విశాలాంధ్ర – భీమవరం : నరేంద్ర మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, అస్తవ్యస్త విధానాలతో నియంతలా వ్యవహరిస్తున్న మోదీ పాలకుడిగా అనర్హుడని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. నియంత పాలనను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని స్పష్టంచేశారు. బీజేపీ హటావో…దేశ్ బచావో నినాదంతో సీపీఐ, సీపీఎం అధ్వర్యంలో నిర్వహి స్తున్న ప్రచారభేరి కార్యక్రమం మంగళవారం ఐదో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు దద్దరిల్లాయి. సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమ వరంలో నిర్వహించిన ప్రచారభేరి కార్యక్రమంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముప్పాళ్ల మాట్లాడుతూ మోదీ నిరంకుశంగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, విదేశాలలో మూలుగుతున్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ .15 లక్షలు ఖాతాలో జమ చేస్తానని వాగ్దానం చేసి ప్రజలను మోసగించారని విమర్శించారు. మోదీ అండదండలతో అదానీ ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించాడో హిండెన్‌బర్గ్ నివేదిక బట్టబయలు చేసిందని ముప్పాళ్ల గుర్తుచేశారు. గ్రామీణ పేదలకు ఆధారమైన ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేయటానికి కుట్ర చేశారన్నారు. రాష్ట్రానికి మోదీ తీరని ద్రోహం చేశారని, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం, పరిహారం చెల్లింపు, అమరావతి రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి హామీలన్నీ పక్కనపెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడవలసిన ముఖ్యమంత్రి జగన్…తన కేసులకు భయపడి మోదీ వద్ద సాగిలపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన కూడా మోదీనికి ప్రశ్నించకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నాయన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ లౌకికవాద పరిరక్షణకు తూట్లు పొడుస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న మోదీ సర్కారును గద్దె దించాలని పిలుపునిచ్చారు. సీబీఐ, ఈడీ, ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకున్నారని విమర్శించారు. దేశంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బీజేపీని సాగనంపాలని పిలుపునిచ్చారు. పేదల పక్షాన పోరాడేది వామపక్షాలు మాత్రమేనన్నారు. ప్రచారభేరి యాత్రలో సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్ రంగారావు, ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు సనపల శ్రీనివాస్, గంజి రాజు, వై.విజయానంద్, ఆకల రాము, కె.రమేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వాసుదేవరావు, భీమవరం పట్టణ కార్యదర్శి వైకుంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నరేంద్రమోదీని గద్దె దించాలి: ఈశ్వరయ్య
రాయచోటిటౌన్: ‘ప్రచార భేరి’ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నుంచీ జగదాంబ సెంటర్ మీదుగా బోస్ నగర్, మదనపల్లి రోడ్ వరకూ ప్రచార కార్యక్రమం జరిగింది. ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ‘నన్ను నమ్మండి…ఈ దేశానికి కాపలా దారుడిగా ఉంటాను’ అని నమ్మబలికి మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న జిత్తుల మారి మోదీని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ హయాంలో అప్పులు పెరిగిపోయాయని చెప్పారు. ఈ దేశాన్ని పాలించిన 14 మంది ప్రధానులు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మోదీ 8 ఏళ్ల పాలనలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల అప్పులు చేశారని దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో నల్లధనాన్ని తెలుపుగా మార్చి పేదల ఖాతాల్లో డబ్బులు వేస్తామని, ఉగ్రవాదం, నక్సలిజాన్ని అంతం చేస్తానని చెప్పి..ఏమి సాధించారని ప్రశ్నించారు. రైతులను నట్టేట ముంచే నల్ల చట్టాలు తెచ్చి, నెలల తరబడి రైతులకు నిద్రాహారాలు లేకుండా చేశారన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, పప్పు, నూనె ధరలు ఇష్టానుసారం పెంచి, సామాన్యుడి నడ్డి విరిచారని ఆరోపించారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అయినా ఈ రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీలు మోదీకే ఊడిగం చేస్తున్నాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సీఎం జగన్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదని నిందించారు. పథకాల పేరుతో ప్రజాధనాన్ని పంచి పెడుతూ రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. జగన్ మోహన్ రెడ్డి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీ పీ ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేశ్, సీపీ ఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు సిద్దిగాల్ల శ్రీనివాసులు, రామాంజులు, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.విశ్వనాథ నాయక్, శంకర్ నాయక్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి సుధీర్ కుమార్, రైతుసంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు లవకుమార్, మహిళా సమాఖ్య నాయకురాలు సుమిత్రమ్మ, ఎంఆర్‌పీఎస్ నాయకులు రామాంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జక్కల వెంకటేశ్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, అశోక్, సీనియర్ నాయకులు వెంకటేశు, జగన్ తదితరులు పాల్గొన్నారు.