. ఎనిమిదిమంది దుర్మరణం… 30 మందికి గాయాలు
. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
. ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
. మృతులకు రూ.ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
విశాలాంధ్ర -పలమనేరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది దుర్మరణం చెందగా… 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మొగిలి ఘాట్ వద్ద ఎదురుగా ఇనుప కమ్మీలతో వస్తున్న భారీ కంటైనర్ ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న మరో లారీ కూడా బస్సును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో బస్సు నుజ్జు నుజ్జు అయింది. బస్సులో ఉన్న డ్రైవర్ తో పాటు ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా… మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఈ ఘాట్ రోడ్డులో ఇనుప కమ్మీలతో వస్తున్న భారీ కంటైనర్ అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని తదుపరి బస్సును ఢీకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. బస్సును ముందువైపు భారీ కంటైనర్ వెనకనుంచి అదుపుతప్పిన మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రెండు లారీల మధ్య బస్సు చిక్కుకోవడంతో స్థానికులు పోలీసులు అతి కష్టం మీద బస్సులో ప్రయాణికులను వెలుపలికి తీసుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ ద్వారా గాయపడ్డ వారిని పలమనేరు , చిత్తూరు బంగారు పాళ్యం ఆసుపత్రులకు తరలించారు. సంఘటనా స్థలానికి హుటాహుటిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ,జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం వల్ల పలమనేరు` చిత్తూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన వైద్యం కోసం వేలూరు ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ప్రమాద ఘటనపై ఆరాతీసి గాయపడ్డ వారికి మెరుగైన వైద్యులు అందించాలని ఆదేశించారు.