Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

బీజేపీని గద్దె దించాల్సిందే

వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలి
ప్రాంతీయ పార్టీలు ప్రజల వైపు ఉన్నాయా… బీజేపీవైపా?
బీహార్‌ పరిణామం ఓ మార్గనిర్దేశం
మారకపోతే జగన్‌కు గుణపాఠం తప్పదు
విశాఖ బహిరంగ సభలో సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా

భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. ఇందుకోసం లౌకిక, ప్రజాస్వామ్య శక్తులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడిరచేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తున్న మోదీ సర్కారును గద్దె దించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. ఇందుకోసం లౌకిక, ప్రజాస్వామ్య శక్తులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడిరచేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర 27వమహాసభల సందర్భంగా విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రం (కార్మికోద్యమ నేత గురుదాస్‌ దాస్‌ గుప్తా సభా ప్రాంగణం)లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా డి.రాజా ప్రసంగించారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశానికి, రాజ్యాంగానికి భారీ ముప్పు ఏర్పడిరదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. భారత్‌ లౌకిక, గణతంత్ర దేశమని, ఇది మత రాజ్యం కాదని, రాజ్యాంగం గురించి చట్టసభల్లో చర్చకు వచ్చినప్పుడు డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్పష్టంగా చెప్పారన్నారు. ఈ దేశం ఎప్పటికీ హిందూ రాజ్యంగా మారడానికి అంగీకరించబోనని కూడా ఆయన తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు తిరంగా పేరుతో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుతున్నాయని, ఇంతకంటే విచారకరమైన, దురదృష్టకరమైన విషయం మరొకటి లేదన్నారు. సీపీఐ 1925లో ఆవిర్భవించగా, ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా అదే సంవత్సరం ఏర్పడిరదన్నారు. ఎర్రజెండా నీడలో కమ్యూనిస్టులు బ్రిటీషు పాలకులపై అలుపెరగని పోరాటం చేశారని, ఎందరో దేశం కోసం ప్రాణాలర్పించారని రాజా చెప్పారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌గానీ, బీజేపీగానీ స్వాతంత్య్ర పోరాటంలో చేసిందేమీ లేదన్నారు. భారతదేశ చరిత్రలో త్యాగాలు చేసింది కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. వాస్తవంగా భారత్‌ను మత రాజ్యంగా చేయడానికి ఆనాడే ఆర్‌ఎస్‌ఎస్‌ విశ్వ ప్రయత్నం చేసిందని, కానీ అంబేద్కర్‌ మాత్రం నిర్ద్వంద్వంగా ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టారన్నారు. స్వతంత్ర భారత దేశంలో సరికొత్త రిపబ్లిక్‌ను నిర్మించేందుకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రయత్నించారని, అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయటానికి కృషి చేశారని అన్నారు. అదే సమయంలో అంబేద్కర్‌ కూడా భారత్‌ సంక్షేమ రాజ్యంగా ఉండాలని ఆకాంక్షించారని, ఆచరణలో కూడా అలా ఉండటానికి వారిద్దరూ తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారని విమర్శించారు. తీవ్ర మత ఉద్రిక్తతలు, విద్వేషాలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో మోదీ పాలన సాగిస్తున్నారని రాజా మండిపడ్డారు. దేశంలో దళితులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు వంటి మైనార్టీలు, ఆదివాసీలపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయన్నారు. మోదీ సర్కారును ప్రశ్నించేవాళ్లను దేశ ద్రోహులుగా, నక్సలైట్లుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి జైళ్లకు పంపుతున్నారనీ, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ వంటి స్వతంత్ర సంస్థలను ప్రయోగించి బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జీఎస్‌టీ వంటి ఏకపన్ను వ్యవస్థ ద్వారా రాష్ట్ర హక్కులను మోదీ సర్కారు హరిస్తున్నదని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని విమర్శించారు. కేంద్రం వసూలు చేస్తున్న జీఎస్‌టీ వాటాను కూడా రాష్ట్రాలకు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు దేశానికి అత్యంత క్లిష్టమైనవని, కమ్యూనిస్టు పార్టీగా మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు కలిసి రావాలని కోరుతున్నామన్నారు. పౌర సమాజం కూడా ముందుకొచ్చి మోదీ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని రాజా పిలుపునిచ్చారు. మరోవైపు బీజేపీ పట్ల ప్రాంతీయ పార్టీలు కూడా తమ వైఖరిని స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిన్నటిదాకా బీహార్‌లో బీజేపీతో కలిసి ఉన్న నితీశ్‌ కుమార్‌ ఆత్మపరిశీలన చేసుకొని తిరిగి మహాకూటమితో చేతులు కలిపారని, ఇది దేశ రాజకీయాల్లో మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఇలాగే అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బీజేపీ నుంచి బయటకు వస్తున్న పరిస్థితులను వివరించారు. దేశంలో అత్యంత యువ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న జగన్‌మోహన్‌ రెడ్డి బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంటు లోపలా, బయటా బీజేపీ అడగకుండానే మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగటం లేదని నిలదీశారు. మోదీ ప్రభుత్వానికి జగన్‌ మోకరిల్లుతున్నారని, బీహార్‌ పరిణామాలను గమనించిన తర్వాత అయినా బీజేపీని నిలదీయాలని, లేకపోతే రాష్ట్ర ప్రజలు జీవితంలో మరచిపోలేని గుణపాఠం నేర్పుతారని రాజా హెచ్చరించారు. అక్టోబరు 14 నుంచి 18వ తేదీ వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరుపుకుంటున్నామని, ప్రస్తుత దేశ పరిస్థితుల్లో ఆ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. దీనికి ముందు విశాఖలో రాష్ట్ర మహాసభలు జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ బహిరంగ సభ ప్రారంభానికి ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుందని కొనియాడారు. ప్రదర్శనలో యువతీయువకులు ఎర్రజెండాలు చేబూని అడుగులో అడుగులేస్తూ ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే కమ్యూనిస్టు పార్టీకి, భారతదేశానికి, ప్రజాస్వామ్యానికి మంచి రోజులొచ్చాయని తనకు అనిపిస్తున్నట్లు రాజా చెప్పారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటివరకు మోదీ తన మాట వినని బీజేపీయేతర 9 ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చివేశారన్నారు. ఏపీ సీఎం జగన్‌లా పాదాభివందనం చేయకపోవడంతో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను అనర్హుడిని చేయడానికి గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌ను వినియోగించుకుంటున్నారన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఎందుకు చేశారో ఇప్పుడు అందరికీ అర్థమైందన్నారు. సోరెన్‌పై కేసులున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులున్నాయన్నారు. మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పడానికి తీవ్ర అవినీతి కేసులున్న జగన్‌ కోర్టుకు సైతం హాజరుకాకపోవడమే ఉదాహరణగా తెలిపారు. పారిశ్రామిక వేత్త అదానీ పెద్ద స్మగ్లర్‌ అని, ఆయన వ్యాపారాభివృద్ధికి సౌకర్యంగా ఉంటుందని దేశంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలన్నింటినీ మోదీ ప్రభుత్వం ఆయనకు అప్పజెపుతున్నదన్నారు. ముంబైలో జీవీకే అప్పును అడ్డుపెట్టుకుని విమానాశ్రయాన్ని అదానీ బలవంతంగా తీసుకున్నారని, అందుకు మోదీ ప్రభుత్వం పూర్తిగా సహకరించడమేకాకుండా, ఆ తర్వాత దాదాపు రూ.12,500 కోట్లు మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఉచిత పథకాలపై చర్చ పెట్టిన సుప్రీం కోర్టు, గత 5 ఏళ్లలో దాదాపు 2 లక్షల 93 వేల కోట్లు పారిశ్రామిక వేత్తలకు చేసిన రుణాల రద్దుపై ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గత 8 ఏళ్లలో రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ కూడా గత మూడేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఎన్నికల్లో ఎంపీ సీట్లన్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌… ఇప్పుడు ఆయనే తన మోకాళ్లు వంచారని ఎద్దేవా చేశారు. సీఎం ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ విధానాలపై శాంతియుత ఆందోళనలు చేసినా తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం పర్యటనను పురస్కరించుకుని విశాఖలో సీపీఐ రాష్ట్ర మహాసభలకు కనీసం జెండాలు, ప్లెక్సీలు సైతం పెట్టకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో దాదాపు 151 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని, స్థానిక సంస్థలన్నింటిలోనూ విజయం సాధించిన జగన్‌… ఇంటి పక్కనున్న హెలిపాడ్‌కు 500 పోలీసు బలగాలను వినియోగించుకుంటున్నారంటే, ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖ రాజ్యమేలుతోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబు తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఇబ్బందిపడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాల్సిన ఐపీఎస్‌లు పాలకుల మోచేతి నీళ్ల కోసం ఆరాటపడటం విచారకరమన్నారు. సభలో జాతీయ కార్యవర్గ సభ్యులు అనీరాజా, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్‌రావు, జల్లి విల్సన్‌, రావుల వెంకయ్య, జి.ఓబులేసు, పి.హరినాథరెడ్డి, జి.ఈశ్వరయ్య, అక్కినేని వనజ, సినీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ఏజే స్టాలిన్‌, ఎ.రామానాయుడు, జంగాల అజయ్‌ కుమార్‌, దోనేపూడి శంకర్‌, పెన్మెత్స దుర్గాభవాని, డి.ఆదినారాయణ, జగదీష్‌, రామాంజనేయులు, ఎం.ఎల్‌.నారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి నాయకులు చంద్రానాయక్‌, పెంచలయ్య, ఆర్‌.పిచ్చయ్య తదితరుల నాయకత్వంలో ఆలపించిన విప్లవ గేయాలు, నృత్యనాటకాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వందేమాతరం శ్రీనివాస్‌ పాడిన పాటలు పార్టీ శ్రేణులను ఉర్రూతలూగించాయి. సభికులు సైతం నృత్యాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img