Friday, June 9, 2023
Friday, June 9, 2023

బీజేపీ మనువాదాన్ని తిప్పికొడదాం

. అన్యాయాన్ని ఎదిరిద్దాం… మహిళా రెజ్లర్లకు మద్దతిద్దాం
. రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఓబులేసు పిలుపు

విశాలాంధ్ర-విజయవాడ(చిట్టినగర్‌): మతం పునాదు లపై రూపొందిన మనువాదాన్ని బీజేపీ ప్రభుత్వం దేశంలో అమలు చేస్తోందని, దీనిని ఐక్యంగా తిప్పికొట్టాలని ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఓబులేసు పిలుపునిచ్చారు. మహిళా అభ్యున్నతికి మను వాదం చేటని, మోదీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని విమర్శించారు. రాతియుగం నాటి పరిస్థితులను తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందన్నారు. మనమంతా చైతన్యవంతంగా కృషిచేస్తే ప్రజాక్షేత్రం నుంచి మనువాద ప్రభుత్వాన్ని వేరు చేయొచ్చని ప్రజలకు ఓబులేసు పిలుపునిచ్చారు. భారత కీర్తిప్రతిష్ఠలు పెంచిన మహిళా రెజ్లర్ల పోరాటానికి మద్దతివ్వాలన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఉండి మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలకు డిమాండ్‌ చేశారు. బుధవారం విజయవాడలోని దాసరిభవన్‌లో ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు కె.ఆర్‌.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ లైంగిక వేధింపుల గురించి ఏడాదిన్నర కిందటే అధికారులకు, ప్రభుత్వానికి మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేస్తే వాటిని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో పిల్లలపై యోగి ఆదిత్యనాథ్‌ అనుచిత వ్యవహారంపై ఆరోపణలను మోదీ విస్మరించారని అన్నారు. కేంద్రప్రభుత్వ విధానాలను కోర్టులు వత్తాసు పలకడం ఆక్షేపణీయమన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, మహిళలంతా ఐక్యంగా మనువాదాన్ని తిప్పికొట్టాలని ఓబులేసు పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో గుజరాత్‌, కేరళ రాష్ట్రాల్లో 41వేల మంది మహిళలను అపహరించి, వ్యభిచార గృహాలకు మనువాద సంస్థలు తరలించినట్లు చెప్పారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి బయట పడేందుకు కర్నాటక రాష్ట్రంలోని 126 సంఘాలు నిర్మాణాత్మకమైన ప్రచారాన్ని చేపట్టాయని, మతోన్మాద బీజేపీకి బుద్ధిచెప్పాయన్నారు. వర్కింగ్‌ ఉమెన్స్‌ ఫోరం రాష్ట్ర నాయకులు ఆర్‌.లక్ష్మీదేవి మాట్లాడుతూ మోదీకి మహిళలంటే చిన్నచూపు అని రెజ్లర్ల పట్ల వైఖరితో స్పష్టమవుతోందన్నారు. రెజ్లర్లు నెలరోజులుగా దిల్లీ నడి బొడ్డున ఆందోళన చేస్తుంటే కేంద్రప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన రెజ్లర్లను కలిసిన పీటీ ఉష… అల్లరి కాకుండా కూర్చొని మాట్లాడుకోవాలంటూ బీజేపీకి అనుకూలంగా సలహాలివ్వటం తగదన్నారు. కశ్మీర్‌లోని కథువా గ్రామంలోని గర్భగుడిలో చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగితే దోషులను బీజేపీ అధిష్ఠానం ఎలా వెనుకేసుకొచ్చిందో అందరికీ తెలుసన్నారు. ఇలాంటివి దేశంలో జరిగితే ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ఎం.సాయి కుమార్‌ మాట్లాడుతూ మహిళా క్రీడాకారుల పోరాటానికి విద్యార్థులు, యువజనలు, మహిళాప్రజాకార్మిక సంఘాలు మద్దతివ్వడం అభినందనీయ మన్నారు. క్రీడాకారులపై పోలీసులు లాఠీలు రaళిపించడం దుర్మార్గమన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు చరిత్రను వక్రీకరిస్తోందని, పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేస్తోందని, నిరసన గళాలను అణచివేస్తోందని, ఇదే కొనసాగితే భవిష్యత్‌లో భారత పౌరులను ఇతర దేశాలకు అమ్మేసే పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు. మహిళా సమాఖ్య విజయవాడ అధ్యక్షులు భారతి, శ్రామిక మహిళ నాయకురాలు కళ్లేపల్లి శైలజ మాట్లాడుతూ రెజ్లర్ల పోరాటానికి అండగా నిలుస్తామన్నారు. బ్రిజ్‌భూషణ్‌ అరెస్ట్‌కు డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఎస్‌.వెంకటసుబ్బయ్య, విజయవాడ నగర నాయకుడు కొట్టు రమణారావు, యువజన నాయకులు లంకే సాయికుమార్‌, గోవిందరాజులు, శ్రామిక మహిళలు, ముఠా కార్మికులు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img