పాత భవనం కూలి ముగ్గురు మృత్యువాత పడటం దురదృష్టకరమని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమె నాలుగవ జోన్ పరిధి రామజోగిపేటలో మూడు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవనం కూలిన సంఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారని, మరో ఐదుగురుకి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సంఘటన స్థలంలో చనిపోయిన వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఇది ఎంతో బాధాకరమైన విషయమని, ఇటువంటి సంఘటనలో పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ కుటుంబాన్ని జీవీఎంసీ తరఫున ఆదుకుంటామని తెలిపారు. ఈ భవనం దాదాపు 40 సంవత్సరాలు క్రితం నిర్మించినదని రెండు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు భవనం కుప్పకూలిందని అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. ప్రమాదం స్థలంలో ఎస్ డిఆర్ఎఫ్ 25 మందితో కూడిన బృందం సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టిందని, చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బ్రీస్ తొలగించాలని జోనల్ కమిషనర్ ను ఆదేశించారు.