విశాలాంధ్ర`అనంతపురం అర్బన్: మద్యనిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అధ్వర్యాన టవర్ క్లాక్ సర్కిల్ వద్ద సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివిధ కంపెనీల మద్యం సీసాలను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి మాట్లాడుతూ, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మద్యనిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలని, షాపుల లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రం లో అంచలంచెలుగా మద్యాన్ని నియంత్రిస్తామని, సామాన్యుడికి మద్యం అందకుండా మద్యం షాపులను ఎత్తి వేసి ఫైవ్ స్టార్ హోటల్స్కు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి మద్యం ఏరులై పారిస్తున్నాడని విమర్శించారు. వెంటనే మద్యం నూతన విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మద్యనిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పార్వతీ ప్రసాద్, కోశాధికారి రామాంజనమ్మ, సింగనమల నియోజకవర్గ నాయకులు లక్ష్మీ దేవి, రాఘవేంద్ర కాలని ఉప సర్పంచ్ రామాంజనేయులు, నాగేంద్ర,వార్డు మెంబర్ ఆజ్బీ, సుభద్ర, స్వాతి, సుశీలమ్మ, శాంతమ్మ, నాగమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.