Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

మరో సమరానికి సన్నద్ధం

ఆగస్టు 31న ‘చలో విజయవాడ’
అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం హామీ నిలబెట్టుకోవాలి
అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు డిమాండ్‌
25న పాత, ఆగస్టు 1న కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు
స్పందనలో కలెక్టర్లకు విజ్ఞాపనలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులకు ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు డిమాండ్‌ చేసింది. శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలిపోయిన 10 లక్షల అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు సత్వరమే డిపాజిట్‌ చెల్లించాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. జగన్‌ గతంలో పాదయాత్ర సందర్భంగా, బాధితుల దీక్షా శిబిరంలోనూ ప్రతిపక్ష నాయకుని హోదాలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తామని ఎన్నికల ముందు చెప్పి, మూడేళ్లుగా నోరు మెదపకపోవడాన్ని తీవ్రంగా ఖండిరచారు. మాట తప్పను, మడమ తిప్పను అని పదేపదే పేర్కొన్న జగన్‌ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రూ.20 వేల లోపు పేద డిపాజిట్‌ దారులకు డబ్బు చెల్లిస్తామని ప్రకటించి, దానిని మరిచిపోయారని అన్నారు. అయితే గత జులైలో అసోసియేషన్‌ చేసిన పెద్ద పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి ఆగస్టు 24న రూ.667 కోట్లు చెల్లించారన్నారు. రూ.20 వేల లోపు ఉన్న మరో మూడున్నర లక్షల మందికి, రూ.20 వేల పైన ఉన్న ఆరున్నర లక్షల మందికి సీఎం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే చెల్లింపులకు ఆదేశిం చాలని ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. జులై, ఆగస్టు లోపు డబ్బు చెల్లించకపోతే మరో భారీ సమరానికి సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు మాట్లాడుతూ రూ.లక్షన్నర కోట్లు ఉచితంగా పంపిణీ చేశామంటూ ఆర్భాటంగా పేర్కొనే సీఎంకు, తన మాటను నమ్మి ఓట్లేసి గెలుపునకు కృషి చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులు గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం… అటు ప్రభుత్వాన్ని, ఇటు ఏజెంట్లను, కస్టమర్లను, మరో వైపు కోర్టునూ దగా కోరు మాటలతో మోసగిస్తున్నారన్నారు. తమ పోరాట ఫలితంగా పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలను తగ్గించగలిగామన్నారు. అసోసియేషన్‌ అధ్యక్షులు ఈవీ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా కంపెనీలు డిపాజిట్లు సేకరించి ప్రజలను మోసగిస్తే, తమ అసోసియేషన్‌ ప్రజా, న్యాయ పోరాటాల ద్వారా ఎన్నో విజయాలు సాధించిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో మరణించిన 142 కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించామని వివరించారు. ఆగస్టులో సుమారు 10 లక్షల మంది చిన్న డిపాజిట్‌ దారులకు రూ.667 కోట్లు ఇప్పించగలిగామన్నారు. ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇంకా మిగిలి ఉన్న 10 లక్షల మంది బాధిత కుటుంబాలకు చెందిన 40 లక్షల మంది ప్రజలకు పూర్తి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం ఈనెల 8,9 తేదీల్లో జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో బాధితులకు ఇవ్వాల్సిన, రూ.3,043 కోట్లను ఎప్పుడు, ఎలా చెల్లింపులు చేయనున్నారో స్పష్టమైన ప్రకటన చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈనెల 20 లోపు స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రాకుంటే, జులై 25న పాత, ఆగస్టు 1 తేదీలలో కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, స్పందనలో కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామన్నారు. ఆగస్టు 31న విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. సదస్సులో అసోసియేషన్‌ నేతలు శేషకుమార్‌రెడ్డి, సిద్దేశ్వర్‌, బీవీ శ్రీనివాస్‌, నాగలక్ష్మి, ఆరేలమ్మ, లోవరత్నం, అంజనాదేవి, మల్లిఖార్జున్‌, మంగరాజు, సూరప్పడు, జగన్‌మోహన్‌, గగన్‌, మంత్రునాయక్‌, ఆగస్త్యన్‌ తదితరులు ప్రసంగించారు. 26 జిల్లాల నుంచి 250 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గీతాలను ఆలపించారు.
ఆమోదించిన తీర్మానాలివీ : వైఎస్‌ జగన్‌ 2017 మార్చి 23న అగ్రిగోల్డ్‌ బాధితుల నిరవధిక దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేసిన సందర్భంగా బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని ఇచ్చిన మాటను ఈ ఏడాది జులై 8,9 తేదీలలో జరగనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశంలో అమలు చేసేందుకు తగిన కార్యాచరణను ప్రకటించాలని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు తీర్మానించింది. రాష్ట్రంలోని పేదలకు వివిధ పథకాల కింద దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలను మూడేళ్లలో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడాన్ని అసోసియేషన్‌ అభినం దిస్తూ, అగ్రిగోల్డ్‌ బాధితులకు ఉచితవరం అవసరం లేదని పేర్కొంది. ఆర్నెళ్లు అన్న సీఎం హామీని, మూడేళ్ల అనంతరమైనా నెరవేర్చి యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకోవాలని సదస్సు తీర్మానించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img