నెల్లూరు పట్టణంలో మహిళా కానిస్టేబుళ్లకు యూనిఫాం కుట్టే విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది. ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కూడా దీనిని సమర్థిస్తూ మాట్లాడటం బాగోలేదన్నారు. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాక్షాత్తు రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేది? మహిళా పోలీసు పట్ల నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల వైఖరిని తప్పుపడుతున్నామని మండిపడ్డారు.