ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయనిరాకరణ, 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సమావేశమయ్యారు.. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇవాళ ఏపీ సీఎస్‌ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నాయి. 23వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి. 25న అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నాయి. 26న అన్ని తాలూకా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహానికి మెమొరాండాలను సమర్పించనున్నాయి. ఈ నెల 27 నుంచి 30 వరకూ నాలుగు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు వెళ్ళనున్నాయి.