Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

మోదీ చేతిలో జగన్‌ కీలుబొమ్మ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడుదాం
సీపీఐ బాపట్ల జిల్లా మహాసభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు

విశాలాంధ్ర`బాపట్ల: బూటకపు హామీలతో గద్దెనెక్కి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమ గీతం పాడాలని సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సీపీఐ బాపట్ల జిల్లా తొలి మహాసభలు గురువారం పట్టణంలో ప్రారంభమయ్యాయి. మహాసభల సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ నుంచి పాతబస్టాండ్‌ వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్‌ భవన్‌ వద్ద అరుణ పతాకాన్ని పార్టీ నాయకులు ఆవిష్కరించారు. మృతవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అనంతరం శవనం శ్రీరామిరెడ్డి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కులాలు, మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ పాలకులు ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ చేతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలు బొమ్మగా మారారని, రాష్ట్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు ఏమాత్రం ధ్యాస లేదని మండిపడ్డారు. జగన్‌కు సీఎం కుర్చీ తప్ప ప్రజల భవిష్యత్తు పట్టడం లేదన్నారు. హామీలు నెరవేర్చడంలో జగన్‌ ఘోరంగా విఫలమ య్యారని ఆరోపించారు. ప్రభుత్వం గోరంత సాయం చేస్తూ…కొండంత భారం మోపుతోందని చెప్పారు. కిలో రూపాయికి బియ్యం ఇస్తూ నిత్యావసర వస్తువులపై భారీగా దోచుకుంటుందని విమర్శించారు. రాష్ట్ర సంప దను కేంద్రానికి దోచిపెట్టడానికే జగన్‌ అధికారంలో ఉన్నారన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల సమస్యలను గాలికొదిలేసి…బూతులు తిట్టుకుంటూ ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండి పడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమా లను ఉధృతం చేస్తామని ముప్పాళ్ల హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణించడం లేదన్నారు. పేదల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వెలిబుచ్చారు. దేశ సంపదను అదానీ వంటి కార్పొరేట్లకు మోదీ దోచిపెడుతున్నారని ముప్పాళ్ల ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే పోర్టులు, సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు లను అదానీకి కట్టబెట్టారని గుర్తుచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ 8 ఏళ్ల మోదీ పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలా యన్నారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్నారన్నారు. ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నట్లు విమర్శించారు. గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ మోదీ, జగన్‌, చంద్రబాబు ప్రజల సంక్షేమాన్ని మరచి… స్వలాభం కోసం పాకులాడు తున్నారన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తున్నారన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు, వామపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వెలుగూరి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు ఐక్యతతో పోరాటాలు చేయాలని కోరారు. సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి పి.నాగాంజనేయులు, సహాయ కార్యదర్శి తన్నీరు సింగరకొండ, పల్నాడు కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌, గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యేల్‌, రేపల్లె కార్యదర్శి గొట్టిముక్కల బాలాజీ, పట్టణ సీనియన్‌ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, జేబీ శ్రీధర్‌, డి.ధనలక్ష్మి, కె.నాగార్జున, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు లక్ష్మారెడ్డి, షేక్‌ మస్తాన్‌, సుభానీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img