Monday, June 5, 2023
Monday, June 5, 2023

మోదీ… జగన్‌ కక్ష సాధింపు

గుణపాఠం తప్పదు: రామకృష్ణ హెచ్చరిక

విశాలాంధ్రబ్యూరో`లేపాక్షి: మోదీ, జగన్‌ సర్కార్ల కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని, ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇదే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని రామకృష్ణ తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేశారని, గ్యాస్‌, నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అంతులేకుండా పోతోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి ప్రతిపక్షాలపై యధేచ్ఛగా దాడులు చేస్తున్నదని, కేసులతో అడుగడుగునా భయపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి కనుచూపు మేర కనిపించడం లేదని చెప్పారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి సర్పంచ్‌ లకు నిధులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో జగన్‌ ప్రభుత్వం ఉందన్నారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోదీ, జగన్‌ ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌, రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, హిందూపురం పట్టణ కార్యదర్శి వినోద్‌, సీపీఐ మండల కార్యదర్శి శివప్ప, ధర్మవరం కార్యదర్శి మధు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి జేవీ రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కుల్లాయప్ప, రాజేంద్ర పాల్గొన్నారు.
పేదల పక్షాన నిరంతర ఉద్యమాలు
పథకాల ముసుగులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయని రామకృష్ణ విమర్శించారు. కేంద్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను తన అనుయాయులకు కట్టబెడుతోందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మంట గలుపుతున్న మోదీ సర్కారుపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేపాక్షిలో జరిగిన జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధి కరువైందని, కేంద్రం నుంచి వచ్చే నిధులను జగన్‌ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని రామకృష్ణ ఆగ్రహం వెలి బుచ్చారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అవినీతి రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. ఓటుకు నోటు సంస్కృతి పెరిగిందన్నారు. ఓటుకు నోటు లేని రాజకీయం సీపీఐ లక్ష్యమన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్నారని, పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పాలకులు జూదంగా మార్చారని, రైతన్నలను భిక్షగాళ్లను చేస్తున్నారని ఆరోపించారు. ఉచితాలు వదిలి రైతుకు నాణ్యమైన విత్తనం, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించాలని సూచించారు. వీటి కోసం గ్రామస్థాయి నుండి పోరాటాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. చిన్న పరిశ్రమ స్థాపనకు సైతం పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడం లేదన్నారు. పరిశ్రమల పట్ల జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టి ప్రజలలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
తాగు, సాగునీటి కోసం జిల్లా ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీటి సమస్య పరిష్కారానికి హంద్రీనీవా ఒక్కటే మార్గమని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్‌ చెప్పారు. హంద్రీనీవా కాలువల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఉన్న జలాలను సైతం కరువు ప్రాంతాలకు పంపడంలో దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన హంద్రీనీవా కాలువలపై నిద్రించి పోరాటాలు చేస్తామన్నారు. పరిశ్రమలు లేక ఈ ప్రాంతం వాసులు వలసలు పోతున్నారన్నారు. ప్రజానాట్య మండలి విప్లవ గీతాలతో శిక్షణా తరగతులు ముగించారు. తరగతులను విజయవంతం చేసిన సీపీఐ లేపాక్షి మండల కార్యదర్శి శివప్ప, పట్టణ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి. గోవిందరెడ్డి, నారాయణరెడ్డి, గౌతమ్‌కుమార్‌, బాలచంద్ర, రాజేంద్ర, వెంకటేశు తదితరులను అభినందించారు. కార్యవర్గసభ్యులు మధు, ఆంజనేయులు, శ్రీరాములు, కదిరప్ప, కుళ్లాయప్ప, రమణ, బాబు, కళాకారులు పినీ కుళ్లాయప్ప, ఆంజనేయులు, పుల్లయ్య, ప్రసాద్‌, సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img