. రేపటి నుంచి సీపీఐ, సీపీఎం ప్రచారభేరి
. విజయవాడలో ప్రారంభ సభ
. ప్రచార జాతా పోస్టర్ ఆవిష్కరణ
విశాలాంధ్ర – విశాఖ: మోదీ ప్రజా, కార్మిక వ్యతిరేక నిరంకుశ పాలనను అంతమొందించేందుకు ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు సీపీఐ, సీపీఎం సంయుక్తంగా ప్రచార భేరి పేరుతో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి , సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడులతో కలిసి ప్రచార జాతా పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రచార భేరి ప్రారంభిస్తున్నామని తెలిపారు. విజయవాడలో జరిగే ప్రారంభ సభకు సీపీఎం సీనియర్ నాయకులు ప్రకాష్ కారత్, సీపీఐ పార్లమెంటరీ నేత వినయ్ విశ్వం తో పాటు ఉభయ పార్టీలకు చెందిన అనేకమంది సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రచార భేరిలో రాష్ట్రంలోని అన్ని నగర, పట్టణ, గ్రామ ప్రాంతాలలో సభలు నిర్వహిస్తామని, ముఖ్య ప్రాంతాల్లో జరిగే సభలకు రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు హాజరవుతారని వెల్లడిరచారు. ఏప్రిల్ 26న విశాఖపట్నంలో నిర్వహించే సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు హాజరవుతారని తెలిపారు. అల్లూరి జిల్లా లో అరకు, పాడేరు, చింతపల్లి, ప్రాంతాలలో జరిగే సభలకు రాష్ట్ర నాయకులు హాజరవుతారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తామని చెప్పారు. ప్రస్తుత బీజేపీ పాలనలో ఎవరూ నోరెత్తి మాట్లాడలేని విధంగా ప్రజలను, అధికారులను, నాయకులను కట్టడి చేస్తున్నారని విమర్శించారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిరంకుశ పాలన చేస్తున్నారని అన్నారు. అదానీ బ్లాక్ మెయిల్ చేసి గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను ఎలా స్వాధీనం చేసుకున్నాడో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. అల్లూరి జిల్లాలో హైడ్రో పవర్ ప్లాంట్లు గిరిజనుల కనీసం హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. ఒక క్షణం కూడా మోదీకి ప్రధాని కుర్చీలో కూర్చుని అర్హత లేదని అన్నారు. జె.వి.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ… ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం దేశంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదన్నారు. 2014లో ఇచ్చిన హామీలలో ఏదీ నెరవేర్చలేదని విమర్శించారు. సామాన్య ప్రజలపై విపరీతంగా ధరల భారాన్ని మోపారన్నారు. రూ. 400 ఉండే గ్యాస్ సిలిండర్ ధర మూడిరతలు పెరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్దం అనంతరం రష్యా నుంచి అతి తక్కువ ధరకు ముడి చమురు లభిస్తున్నా పెట్రోల్ ధరలు తగ్గించలేదని అన్నారు. రిలయన్స్ సంస్థ అతి తక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకొని అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నదని తెలిపారు. నరేంద్ర మోదీకి అదానీ, అంబానీలు తప్ప ఇతర ప్రజలు కనిపించడం లేదని విమర్శించారు. వారి లాభార్జన కోసమే నరేంద్ర మోదీ అహర్నిశలూ పనిచేస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో అమెరికా పర్యటనకు వెళ్లిన నిర్మలా సీతారామన్ ఒక యూనివర్సిటీలో ప్రసంగిస్తూ… భారత్‌లో ముస్లిం ప్రజలకు భద్రత ఉందని చెబుతూనే హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రసంగించారని అన్నారు. అలాంటప్పుడు 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ పై ఎందుకంత రభస చేశారో చెప్పాలని అన్నారు. దేశంలో మైనారిటీలకు భద్రత లేదని, మైనార్టీలపై దాడులు పెరిగాయని, దీనిపై లెక్కలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. దళితులు, గిరిజనులపై కూడా తీవ్రమైన దాడులు జరిగాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో శ్రమను నమ్ముకుని బతికే వారిపై ఆర్థిక భారాలు పెరిగాయని అన్నారు. తద్వారా అదానీ, అంబానీలు లాభపడుతున్నారని తెలిపారు. సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎం జగ్గు నాయుడు, ఎం పైడిరాజు మాట్లాడుతూ 14 ఉదయం 9 గంటలకు నగరంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి జరిపి, పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నెల 26న గాజువాకలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.