Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

మోదీ సర్కారుకు బుద్ధి చెప్పేందుకు భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి

ప్రభుత్వరంగ సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలి
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ పిలుపు
27న బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్షాల పాదయాత్ర

విశాలాంధ్రవిజయవాడ : ప్రజావ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తగిన బుద్ధి చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలను, జాతి సంపదను కాపాడుకునేందుకు ఈ నెల 27వ తేదీన భారత్‌ బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్ష పార్టీల అధ్వర్యాన శుక్రవారం సాయంత్రం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ నుంచి బీసెంట్‌ రోడ్డు, రాజగోపాలచారి రోడ్డు, అప్సర సెంటర్‌ మీదుగా తిరిగి లెనిన్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల గ్రామీణ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలు అమల్లోకి వస్తే రైతుల చేతుల్లో వ్యవసాయం ఉండదని, అంతా కార్పొరేట్ల కబంద హస్తాల్లో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రైతులు, వారిపై ఆధారపడిన కూలీలు ఉపాధి కోల్పోతారని, చేతివృత్తులవారు మరింత చితికిపోతారని, మొత్తంగా గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభంలో కూరుకుపోతుందని వివరించారు. అందువల్లే 500లకు పైగా రైతు, రైతు కూలీ సంఘాలు, 450 కార్మిక సంఘాలు, 19 రాజకీయ పార్టీలు కలిసి వ్యవసాయాన్ని, రైతులను రక్షించుకునేందుకు తద్వారా దేశాన్ని కాపాడుకునేందుకు భారత్‌ బంద్‌కు పిలుపు నిచ్చాయని, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించు కోవడంలో విజయవాడ కీలకపాత్ర పోషించిందని, ఇక్కడ అనేకమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తుచేశారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాల క్రితం పాలకుల విధానాలను పరిశీలించి తాకట్టులోకి భారతదేశం వెళుతుందని తరిమెల నాగిరెడ్డి చెప్పిన విషయాన్ని మోదీ నిజం చేస్తున్నారని మండిపడ్డారు. రైల్వేలు, విమాన, నౌకాయానం నుంచి అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడు తున్నారని, ఈ దగాకోరు విధానాలను అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలకు ఏమీ మిగల్చరని చెప్పారు. సీపీఎం సిటీ కోఆర్డినేటర్‌ డి.కాశీనాథ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణల ఫలితంగానే ట్రూ అప్‌ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.6,600 కోట్ల భారం మోపుతున్నారని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్ఫలితాలను ప్రతి ఒక్కరూ గుర్తించి బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు తాడి పైడయ్య, అప్పురబోతు రాము, సంగుల పేరయ్య, కేవీ భాస్కర్‌రావు, ఈమని దాము, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు, శాఖా కార్యదర్శులు కె.కోటేశ్వర రావు, పడాల కనకారావు, రవికుమార్‌, తిప్పాబత్తుల వెంకటేశ్వరరావు, రాచాకుల శ్రీనివాస్‌, శింగరాజు సాంబశివరావు, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి టి.తాతయ్య, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సీహెచ్‌వీ రమణ, సీపీఐ నాయకులు మన్నెం సుబ్బయ్య, బీసెంట్‌ రోడ్డు హాకర్స్‌ యూనియన్‌ నాయకులు కుమార్‌, ఎంసీపీఐ(యు) నాయకుడు ఖాదర్‌బాష, పండ్ల ముఠా కార్మిక సంఘ నాయకులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img