Monday, June 5, 2023
Monday, June 5, 2023

మోదీ హయాంలో దారిద్య్రంలోకి భారత్‌

. లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కలసి పోటీ
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓడిస్తాం: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. అత్యంత దారిద్య్ర దేశంగా భారత్‌ ఆవిర్భవించినందుకు ప్రపంచం మన వైపు చూస్తుందా అని ప్రశ్నించారు. స్థానిక సీఆర్‌ భవన్‌లో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు పి. రామచంద్రయ్యతో రామకృష్ణ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ సర్కారు అధికారం చేపట్టి 9 ఏళ్లు అయినా దేశానికి చేసిందేమిటని రామకృష్ణ ప్రశ్నించారు. ఒక్క భారీ పరిశ్రమ వచ్చిందా? కొత్త నీటి ప్రాజెక్టు చేపట్టారా? అని నిలదీశారు. ఇవి చేయకపోగా లాభసాటి ప్రభుత్వరంగ సంస్థలను వరుసగా తన కార్పొరేట్‌ మిత్రులకు కట్టబెడుతోందని విమర్శించారు. ‘రైతు ఆత్మహత్యలు ఆగలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. విదేశాల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదు’ అని మండిపడ్డారు. మోదీ హయాంలో ఏమి గొప్పలు జరిగాయని ప్రపంచదేశాలు భారత్‌ వైపు చూస్తున్నాయని అడిగారు. ప్రపంచంలోని కఠిక దారిద్య్ర దేశాల్లో నాడు నైజీరియా ప్రథమస్థానంలో నిలవగా…ఇప్పుడు భారత్‌ ఆ స్థానాన్ని ఆక్రమించిందని వివరించారు. ‘భారతదేశంలో డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెరిగిపోయాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఏ రైతు ఆదాయం రెట్టింపు అయింది’ అని ప్రశ్నించారు. వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వారంతా గుజరాతీయులేనని, వారంతా అక్కడ విలాసవంత జీవితం గడుపుతున్నారని రామకృష్ణ తెలిపారు. అవినీతిపై ప్రశ్నిస్తే ప్రధాని మోదీ విపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. అదానీ అక్రమాలపై జేపీసీ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేస్తే మోదీ సర్కారు భయపడుతోందన్నారు. ఎలాంటి చర్చ లేకుండా రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్రం ఆమోదించడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. కరోనా మృతుల సంఖ్య వెల్లడిరచటానికి భయపడుతోందన్నారు. మోదీ సర్కారుపై విమర్శలు చేసినా…ధిక్కార స్వరం వినిపించినా…ప్రత్యేకించి విపక్ష నేతలపై ఈడీ, సీబీఐని ప్రయోగించడం అలవాటుగా మారిందని తీవ్రంగా విమర్శించారు. రాహుల్‌గాంధీని రాజకీయాలకు దూరం చేసే కుట్రలో భాగమే ఆయనపై అనర్హత వేటు అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక తీవ్రంగా ఉందని రామకృష్ణ చెప్పారు. జగన్‌ అనాలోచిత, చేతకాని విధానాల కారణంగా రాష్ట్రం అప్పులపాలైందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిరదని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడినా…నోట్ల కట్టలు పంచినా…మంత్రుల దగ్గర నుంచి అన్నిస్థాయిల నాయకులు ప్రచారం చేసినా వైసీపీకి ఓటమి తప్పలేదని, ఇది ప్రజావ్యతిరేకతకు నిదర్శనమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 87 శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని సీఎం జగన్‌ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. లౌకిక, ప్రజాతంత్రశక్తులతో కలసి అటు మోదీని, ఇటు జగన్‌ను ఓడిస్తామని రామకృష్ణ చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ, వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్‌ఎన్‌ రసూల్‌, ఎస్‌.మునెప్ప, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img