Friday, December 2, 2022
Friday, December 2, 2022

రాజధాని దొంగలను కఠినంగా శిక్షించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతిలో సీపీఐ నేతల బృందం పర్యటన

తాడేపల్లి : వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతమైన మందడం గ్రామంలో కంకర, గ్రావెల్‌, ఇసుక, చివరికి మట్టిని కూడా దొంగతనం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం అమరావతి ప్రాంతంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ నేతల బృందంతో కలసి పర్యటించారు. తొలుత మందడంలోని అమరావతి పరిరక్షణ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఫీుభావం తెలిపారు. అనంతరం గత ప్రభుత్వ హయాంలో నిల్వచేసిన కంకరు, మట్టి, ఇసుక, గ్రావెల్‌ దొంగతనం జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని చుట్టూ దొంగలు తిరుగుతు న్నట్లు కనబడుతోందని అన్నారు. ఎవరైతే ఇసుక, కంకరు, గ్రావెల్‌, మట్టి, దొంగతనాలకు పాల్పడ్డారో వారిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జేఏసీ నేతలు అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం 605 రోజులుగా చేస్తూంటే.. మంత్రులు పోరాటం ఏమీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏమీ లేకపోతే రాజధాని ఉద్యమం 600వ రోజున 100 చెక్‌పోస్ట్‌లు ఎందుకు పెట్టారని, మూడు వేల మంది పోలీసులను ఎందుకు కాపలా పెట్టారని, ఇనుప కంచెలు ఎందుకు వేయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి సెక్రటేరియట్‌కు రావాలంటే 1000 మంది పోలీసులు కావాలని అన్నారు. ఒక మంత్రి మాట్లాడుతూ అచ్చెంనాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి అని, అతను రాజధానిగా విశాఖపట్నంకు మద్దతు తెలియజేయాలని అంటున్నారని, మరీ కృష్ణా జిల్లాలో ఉన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని దేనికి మద్దతివ్వాలి? గుంటూరు జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధాని ఎక్కడ కావాలని కోరాలని రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రంలోని 90 శాతం మంది ప్రజలు కోరుకుంటు న్నందున రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగిం చాలని డిమాండ్‌ చేశారు. మూర్ఖంగా మారుస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
అమరావతి ఉద్యమం 29 గ్రామాలకు పరిమితం కాదు : ముప్పాళ్ల
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలను ధ్వంసం చేయడంలో కంకర, ఇసుక, మట్టి, గ్రావెల్‌ దొంగిలించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు. అబ్బరాజుపాలెంలో , అనంతవరంలో కంకరు దొంగిలించారని, హైకోర్టు వద్ద ఇసుకను దొంగిలించారని, శాసనసభ వద్ద నల్ల మట్టిని కొల్లగొట్టారని అన్నారు. అమరావతి రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాల ఉద్యమం కాదని, సమయం వచ్చినప్పుడు 13 జిల్లాలలోని ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతికి జేజేలు పలుకుతారని అన్నారు. నిర్మించిన రోడ్డును రాత్రిపూట ప్రొక్లెయిన్లతో తవ్వుకొని వెళితే వారిని పట్టించుకోలేదంటే ఇది పోలీస్‌ శాఖకు అవమానమని అన్నారు. ఆగస్టు 18వ తేదీ లోపు ఈ దొంగలను అరెస్టు చేయకపోతే 18వ తేదీన ఎస్పీ కార్యాలయానికి వెళతామని అన్నారు. తక్షణమే దొంగలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.
గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేయడంతో పాటు అధికార పార్టీ అండతో రోడ్లను కూడా తవ్వుకొని వెళుతుండటం దారుణం అన్నారు. నిజంగా లైసెన్ను వున్న దొంగలు చేస్తున్న పనిలాగా కనబడుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మంగళగిరి నియోజక వర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు, ఏఐటీయూసీ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గని, రాజధాని ప్రాంత కన్వీనర్‌ జీవీ రాజు, తుళ్లూరు మండల కార్యదర్శి గుంటుపల్లి వెంకటేశ్వరరావు, సీపీఐ కృష్ణా జిల్లా సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, కంభంపాటి దేవునిదయ, యువజన నాయకులు రత్న రాజు, దళిత జేఏసీ కో కన్వీనర్‌ చిలక బసవయ్య, రాజధాని రైతులు, జేఏసీ నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img