ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజల తరలింపుపై సీఎం జగన్ సమీక్ష
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకి వివరించారు. కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా కేంద్రాల్లో కాల్‌సెంటర్లు ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితోనూ టచ్‌లో ఉండాలని, వారి యోగ క్షేమాలు తెలుసుకోని భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు తగిన మార్గనిర్దేశం చేయాలని, కేంద్ర అధికారులకు అవసరమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏపీకి చెందిన వారి నుంచి సమాచారం వస్తే విదేశాంగశాఖకు తెలియజేయాలన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారి తరలింపులో రాష్ట్రం నుంచి కేంద్రానికి సహకారం అందించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్, సీఎంవో అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.