రిజర్వేషన్లు కాపాడుకునేందుకు నిరంతర పోరాటాలు
శ్రీ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఉద్యమాలు
విశాలాంధ్ర`టెక్కలి: రాజ్యాంగం సమీక్షిస్తామనే పేరుతో బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉన్న రిజ ర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర పన్నుతోందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జేవీ ప్రభాకర రావు, కరవది సుబ్బారావు ఆరోపించారు. టెక్కలి మండలం తొలుసూరుపల్లి రోడ్డులో గల పూర్ణ కల్యాణ మండపంలో జరిగిన డీహెచ్‌పీఎస్ శ్రీకాకుళం 3వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి నిలిపివేశారన్నారు. ఎస్సీలకు ఇస్తున్న 18 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసింది, వెంటనే ఆ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, విద్య, ఉపాధి కోసం నిరంతరం దళితుల సమస్యలపై గళమెత్తి పోరాడుతున్నది డీహెచ్‌పీఎస్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. అట్టడుగున ఉన్న దళితులు, కార్మికులు, రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం జోలికి వస్తే దళితులచే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి డీహెచ్‌పీఎస్ నేత గోపీ అధ్యక్షత వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖ రావు, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి పాలపోలా రావు, బలగ రామారావు, చిట్టి సింహాచలం, సామ హిరణ్య రావు, జామాన రామారావు, చింతల సరస్వతమ్మ, బసవల భాగ్యలక్ష్మి, చిట్టి వరలక్ష్మీ, బమ్మిడి వేణుగోపాల్, నాగవంశం త్రినాథ్, పంచెల శ్రీను, మీసాల వెంకట రావు, ముంజేటి.రాము, వడ్డి దాలయ్య,రేగు గాసయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జన నాట్యమండలి ఉదయ్ భాస్కర్ బృందం ఆలపించిన అంబేద్కర్ గేయాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత అంబేద్కర్ సామాజిక భవనం వద్ద, అంబేద్కర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అలంకరించారు. అనంతరం డప్పు కళాకారుల ప్రదర్శనల మధ్య డీహెచ్‌పీఎస్ కండువాలు, జండాలతో నీలి రంగులో టెక్కలి పురవీధులు అంబేద్కర్ నినాదాలతో మారు మోగాయి. అనంతరం డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా యడ్ల గోపీ, అధ్యక్షులుగా పాల పోలారావు లతో పాటు మరో 19 మంది కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.