వరదసాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నేడు తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.నా సతీమణి గురించి మాట్లాడారు.. బాధనిపించింది. ఎన్టీఆర్ బిడ్డ వ్యక్తిత్వాన్ని కించపరిచారని అన్నారు. ఏపీ శాసనసభను కౌరవ సభగా మార్చారని.. తాను మళ్లీ గౌరవ సభగా మార్చి ఆ సభకే వస్తానని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం.. ఉన్మాదుల స్వామ్యం కాదు. తప్పుడు పనులు చేసినవారిని ఎవరినీ వదిలిపెట్టనని అన్నారు. అలిపిరిలో మందుపాతరలకే నేను భయపడలేదని అన్నారు. మేము ఉన్నామని మనోధైర్యం ఇచ్చేందుకు వచ్చాను. భారీగా వర్షాలు వస్తాయని తెలిసినా ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇంత నష్టం జరిగేదా? అని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… సీఎం జగన్రెడ్డి గాలిలో తిరుగుతారా? అని అన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని.. టీడీపీ అండగా ఉంటుందని అన్నారు.