Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కూలీల ప్రాణం తీసిందా?

విశాలాంధ్రబ్యూరో`అనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండాయపల్లిలో గురువారం ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా కూలీలు విద్యుదాఘాతానికి గురై దుర్మణం చెందిన ఘటనకు కారణం… విద్యుత్‌ అధికారుల నిర్లక్షమా? ఆటోడ్రైవర్‌ అజాగ్రత్తనా? ఇతర కారణలా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఎట్లున్నా ఈ విషయంలో బాధ్యత వహించాల్సిన విద్యుత్‌ అధికారులు చెబుతున్న కారణాలు విని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉడత కొరికితే హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తెగిపోయిందంటే జనం నమ్మేపరిస్థితి కనిపించడంలేదు.అంటే అంత నాసిరకం వైర్లు కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేస్తే అధికారులు పట్టించుకోలేదా? ఐదు మంది ప్రాణాలు కోల్పోతే చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉడతవైరు కొరికడంతో ఆటోపై పడిరదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆటోపై విద్యుత్‌ తీగ పడి విద్యుత్‌ ప్రసరించడంతో ఆటోనుంచి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు. అయితే విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే కూలీలు నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన విద్యుత్‌ అధికారులు తమదైన శైలిలో వివరణ ఇచ్చారు. కరెంట్‌ తీగలపై ఉడత వెళ్లడంతో ఎర్తింగ్‌ అయి ఉష్ణోగ్రత పెరిగి తీగలు తెగిపడ్డాయట. సబ్‌స్టేషన్‌లో రక్షణ వ్యవస్థలు పని చేయకపోవడమే కరెంట్‌ తీగలు తెగిపడటానికి కారణమన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. మాములుగా కరెంట్‌ తీగలు తెగిపడితే వెంటనే ఎర్తింగ్‌ అవుతుంది. ఆ తర్వాత 11 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు వాటంతట అవే పనిచేస్తాయి, లైన్లకు కరెంట్‌ సరఫరా ఆగిపోతుంది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. 11 కేవీ సబ్‌స్టేషన్‌లో బ్రేకర్లు పనిచేయకపోయినా, 33 కేవీ సబ్‌ స్టేషన్‌ లో అలాంటి వ్యవస్థే ఉంటుంది. ఏదైనా సమస్యలతో 11 కేవీ సబ్‌స్టేషన్‌ బ్రేకర్లు పనిచేయకుంటే, 33 కేవీ సబ్‌స్టేషన్‌లోని బ్రేకర్లు పనిచేస్తాయి. ఇలా రెండు దశల్లో భద్రతా వ్యవస్థ డిస్కంలలో ఉంటుంది. చిల్లకొండాయ పల్లి ప్రమాదంలో ఈ రెండు వ్యవస్థలు పనిచేయలేదని తెలుస్తోంది. బ్రేకర్లు పనిచేస్తే కూలీల ప్రాణాలు దక్కేవని విద్యుత్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. గురువారం ప్రమాదం జరిగింది 11 కేవీ లైన్‌లో. ఈ లైన్‌ లో 12 లీడ్‌ల వైర్లు ఉంటాయి. అధికారులు చెప్పినట్లు వైర్లు తెగిపడితే అక్కడ ముందు మంటలు రావాలి. కాని ప్రమాదం జరిగినప్పుడు తీగలపై ఎలాంటి మంటలు రాలేదని స్థానికులు చెబుతున్నారు. ఉడత తోక భాగంలోని వెంట్రుకలు కొంచెం కాలిపోయాయి. అయితే కరెంట్‌ తీగలు తెగిపడేంత ఉష్ణోగ్రత వస్తే, ఉడత ఎందుకు కాలిపోలేదన్న ప్రశ్న తలెత్తింది. దీంతో సాంకేతిక, నిర్వహణ లోపాలు వల్లే దారుణం జరిగిందని స్పష్టమవుతోంది. డిస్కంలు భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్లే ఏపీలో వరుసగా విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సబ్‌ స్టేషన్లలోని బ్రేకర్లలో సాంకేతిక సమస్యలు వస్తే అమర్చాల్సిన సామాగ్రిని డిస్కంలు కొన్ని రోజులుగా ఇవ్వడం లేదని తెలుస్తోంది. సమస్యలు ఉన్న బ్రోకర్లను మార్చడానికి కొత్తవి అందుబాటులో లేవు. వీటి కోసం ప్రతి డిస్కం రూ.10 కోట్లు నిధిని ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్‌సీ సూచించినా ఎవరూ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అధికారుల నిర్వహణ వైఫల్యం వల్లే విద్యుత్‌ ప్రమాదంలో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారనే ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం ఐదు, ఆరు పంచాయతీలకు కలిపి ఒక్కరే ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌ ఉంటున్నారు. తక్షణమే లైన్‌ మ్యాన్‌, టెక్నీషియన్లు, హెల్పర్‌, లైన్‌ ఇన్స్పెక్టర్ల , ఇంజినీర్ల పోస్టులు భర్తీ చేయాలి. ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా ప్రభుత్వం చర్చలు తీసుకోవాల్సి ఉంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఎల్‌టీ, హెచ్‌టీ లైన్‌లను కనిష్ఠంగా 19 అడుగుల ఎత్తులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ కట్టడాలు, చెట్ల నుంచి కనీసం నాలుగు అడుగుల దూరంలో ఏర్పాటు చేయాలి. ట్రాన్స్‌ఫార్మర్లను ఆరడుగుల ఎత్తులో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నెలకొల్పాలి. జనావాసాలు, రోడ్లపై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ తప్పనిసరిగా కంచె ఏర్పాటు చేయాలి. వేలాడే తీగలను ఎప్పటికప్పుడు సరిచేయడం, తుప్పు పట్టిన, కాలం చెల్లిన స్తంభాలను మార్చడం ముఖ్యం. విద్యుత్‌ లైన్లలో మరమ్మతులు వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేట్లు చూడాలి. విద్యుత్‌ సిబ్బంది లైన్లపై పని చేసే ముందే ఎర్తింగ్‌ సరిచూసుకోవాలి. ప్రతి సబ్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి రోజు రెండు ట్రాన్స్ఫార్మర్లను నిశితంగా గమనించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img