వివేకా హత్య కేసు పరిణామాల నేపథ్యంలోనే సమావేశం?
హాజరైన వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
వైసీపీ ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ మీటింగ్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇప్పటికే సీఎం అనంతపురం పర్యటన, అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం, ఈరోజు సీబీఐ ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరుకానుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ ఉదయాన్నే అవినాశ్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ కు అవినాశ్ రెడ్డి బయల్దేరినప్పుడు.. ఆయనతోపాటు చెవిరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో అవినాశ్ తో చర్చించిన అంశాలను జగన్ కు చెవిరెడ్డి వివరించినట్లు సమాచారం.తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించనుంది. దీంతో హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుంది? సీబీఐ విచారణ, కోర్టు ఆదేశాల తర్వాత చోటుచేసుకునే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? వంటి అంశాలపై జగన్ చర్చించినట్లు సమాచారం.