Monday, August 15, 2022
Monday, August 15, 2022

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

. వివిధ సంఘాల అధ్వర్యంలో విజయవాడలో ధర్నా
. 4న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలకు పిలుపు

విశాలాంధ్ర-విజయవాడ(గాంధీనగర్‌): అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గ్రామీణ పేదలు, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఎదుర్కొం టున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) ఏపీ వ్యవ సాయ కార్మిక సంఘం (ఎఐఏడబ్ల్యూయూ), అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌), అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం అధ్వర్యాన సోమ వారం విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ… దేశంలో నేటికీ 70 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారన్నారు. గ్రామీణ పేదల కోసం తీసుకొచ్చిన చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేశారని, ఆ చట్టాలను సంపన్నులకు అనుకూలంగా మారుస్తున్నారని విమర్శించారు. భూ సీలింగ్‌ చట్టాన్ని మరుగున పడేశారని, పేదల భూములకు రక్షణగా ఉన్న 9/77 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. వామపక్షాల పోరాటంతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, ఆహార భద్రత చట్టాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు.ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి కేంద్ర బడ్జెట్లో 2 లక్షల 40 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సంవత్సరానికి 200 రోజుల పని, రోజుకు రూ.600/-లు వేతనం ఇవ్వాలన్నారు. పథకాన్ని పట్టణ ప్రాంతాలకు వర్తింపచేయాలన్నారు. భూమి లేని కుటుంబాలకు భూ పంపిణీతో పాటు, ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటినిర్మాణ వ్యయాన్ని రూ.6లక్షలకు పెంచాలని, రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆహార భద్రత చట్టం ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లను సాధన కోసం ఆగస్టు 4 న అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనలు, 14న జనజాగరణ ద్వారా ప్రభుత్వాలకు నిరసన తెలియజేయాలని పిలుపు నిస్తున్నామన్నారు. ఏపి వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో పనిలేక 20 కోట్లమంది పనుల కోసం వలసలు పోతున్నారన్నారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, కౌలురైతులకు గుర్తింపుకార్డులు, రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో భాస్కర్‌, ఈశ్వరయ్య, ఉప్పెన కనకారావు, ఎమ్‌.త్యాగరాజు, ఎస్‌కే నాగుల్‌ మీరా, దడాల సుబ్బారావు, తోట కళ్యాణ్‌, నటరాజ్‌, అజయ్‌కుమార్‌, అండ్రు మాల్యాద్రి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img