వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మధ్య పోటీ
మంత్రులు, ఎంపీలైన ఆ నలుగురు…
1978లో గెలుపొందిన సి.దాస్‌అంజయ్య రాష్ట్ర జౌళి శాఖ మంత్రిగా, 1999లో గెలుపొందిన ఎన్.శివప్రసాద్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా గతంలో పనిచేశారు. 1962లో గెలుపొందిన టి.బాల క్రిష్ణయ్య లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1983లో గెలుపొందిన తలారి మనోహర్ రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు.
తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్యవేడు ఉంది. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరగబోతోంది. వైసీపీ తరపున నూకతోటి రాజేశ్, టీడీపీ తరపున కోనేటి ఆదిమూలం, కాంగ్రెస్ తరపున బాలగురువమ్ బాబు పోటీ చేస్తున్నారు. పునర్విభజనకు ముందు సత్యవేడు నియోజకవర్గం… తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా, తిరువల్లూరు తాలూకా పరిధిలో ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1962, ఏప్రిల్ 2న ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ, నాగలాపురం, పిచ్చాటూరు, పెళ్లకూరు, తొట్టంబేడు మండలాలను కలిపి సత్యవేడు నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తొట్టంబేడు, పెళ్ళకూరు మండలాలను వేరుచేసి… నారాయణవనం, కేవీబీపురం మండలాలను కలిపారు.
గత ఎన్నికల్లో గెలుపోటములు
సత్యవేడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 1962లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు 13సార్లు జరిగిన ఎన్నికలలో అత్యధికంగా ఆరుసార్లు టీడీపీ గెలిచింది. కాంగ్రెస్ ఐదు సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, వైసీపీ ఒకసారి చొప్పున గెలుపొందాయి. 1982 వరకు నియోజకర్గంలో కాంగ్రెస్ విజయ పరంపర కొనసాగింది. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ గెలిచింది.
1962 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాలకృష్ణయ్య… స్వతంత్ర అభ్యర్థి కటారి మునుస్వామిపై గెలిచారు. 1967 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి కటారి మునిస్వామి తన సమీప అభ్యర్థి బాలకృష్ణయ్య (కాంగ్రెస్)ను ఓడిరచారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి సి దాసు… తన సమీప ప్రత్యర్థి సింగమనని (డీఎంకే)పై గెలిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దాసు… జనతా పార్టీ ప్రత్యర్థి గంగాధరంపై గెలుపొందారు. 1983లో టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్… కాంగ్రెస్ ప్రత్యర్థి దాసుపై విజయం సాధించారు. రెండేళ్లకే ప్రభుత్వం పడిపోవడంతో 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సూరజ్… కాంగ్రెస్ ప్రత్యధి ఎండూరి బాబురావును ఓడిరచారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాసు… టీడీపీ అభ్యర్థి తలారి మనోహర్‌పై గెలుపొందారు. 1994లో టీడీపీ అభ్యర్థి సూరజ్ … కాంగ్రెస్ ప్రత్యర్థి నారాయణస్వామిని ఓడిరచారు. 1999లో టీడీపీ అభ్యర్థి శివప్రసాద్… కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామిపై విజయం సాధిం చారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామి… టీడీపీ అభ్యర్థి శివప్రసాద్‌పై గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి హేమలత… కాంగ్రెస్ అభ్యర్థి నారాయణస్వామిపై గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య… వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలంపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలం… టీడీపీ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌పై గెలుపొందారు.
మొత్తం ఓటర్లు 2,15,325 మంది
సత్యవేడు నియోజకవర్గంలో 2,15,325 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,04,348 మంది, మహిళలు 1,10,966 మంది ఉన్నారు. మండలాల వారీగా చూసినట్లయితే సత్యవేడు మండలంలో పురు షులు 18,322 మంది, మహిళలు 20,125 మంది, ఇతరులు ఇద్దరు చొప్పున ఉన్నారు. నాగలాపురం మండలంలో పురుషులు 13,049 మంది, మహిళలు 13, 824 మంది ఉండగా పిచ్చాటూరు మండలంలో పురుషులు 12,058 మంది, మహిళలు 12, 973 మంది ఉన్నారు. కేవీబీ పురం మండలంలో పురుషులు 16,395 మంది, మహిళలు 17,161 మంది, ఇతరులు ఇద్దరు చొప్పున ఉన్నారు. వరదయ్యపాలెం మండలంలో పురుషులు 18,134 మంది, మహిళలు 19,052 మంది, ఇతరులు ముగ్గురుÑ బీఎన్ కండ్రిగ మండలంలో పురుషులు 12,626 మంది, మహిళలు 13,447 మంది, ఇతరులు ఇద్దరు చొప్పున ఉన్నారు. నారాయణ వనం మండలంలో పురుషులు 13,764 మంది, మహిళలు 14,384 మంది ఉన్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఓటర్లు అత్యధికంగా 38,449 మంది సత్యవేడులో ఉంటే… అత్యల్పంగా 25,032 మంది పిచ్చాటూరు మండలంలో ఉన్నారు.
` విశాలాంధ్ర- సత్యవేడు