Friday, October 7, 2022
Friday, October 7, 2022

సీపీఎస్‌ రద్దుపై తగ్గేదే లేదంటున్న ఉద్యోగులు.. కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన

సీపీఎస్‌ రద్దుపై ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాటపట్టారు. ఈనెల 11న విజయవాడలో తలపెట్టిన శాంతియుత నిరసనకు సన్నాహకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎస్‌ రద్దుకోసం డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దుచేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం జగన్‌, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. అప్పట్లో సీఎం జగన్‌ హామీని నమ్మి తామంతా ఓట్లు వేశామని, మూడేళ్లవుతున్నా ఇప్పటికీ సీపీఎస్‌ రద్దు చేయకపోగా జీపీఎస్‌ అంటూ తెస్తున్న కొత్త విధానాన్ని ఒప్పుకోబోమన్నారు ఉద్యోగులు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, వారికి అన్నివిధాల ఆయన మేలు చేకూర్చారని, జగన్‌ కూడా అదే బాటలో నడవాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు ప్రదర్శన చేపట్టి, ఏపీజేఏసీ ఆధ్వర్యంలో సీపీఎస్‌ రద్దుకోసం నినాదాలు చేశారు.
కడపలో
ఉద్యోగికి సామాజిక భద్రత లేని సీపీఎస్‌ ను తక్షణం రద్దు చేయాలంటూ కడప కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు సీపీఎస్‌ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కాలయాపన చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. తక్షణం సీపీఎస్‌ రద్దు చేసి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, అర్హులైన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. వీటి పరిష్కారం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని హెచ్చరించారు.
11న చలో విజయవాడ
సెప్టెంబర్‌ 1న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు వాయిదా వేసుకున్నారు. దీన్ని సెప్టెంబర్‌ 11న నిర్వహించబోతున్నట్టు వెల్లడిరచారు. పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చినట్టుగానే సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం మాత్రం సీపీఎస్‌ రద్దు కుదరదని… అప్పట్లో తెలియకుండానే ఈ హామీ ఇచ్చామని… ఇది రద్దు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటోంది. దీనికి బదులు ఉద్యోగులకు ఫలప్రదమైన జీపీఎస్‌ ఇస్తామంటూ చర్చలు జరుపుతోంది.
అసంతృప్తితో ఉద్యోగులు
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం చర్యను తప్పుపడుతున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుందని ఆక్షేపిస్తున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా చలో విజయవాడ పిలుపునిచ్చింది ఏపీసీపీఎస్‌ఈఏ. పదిహేను రోజుల క్రితం సమావేశమైన ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు చలో విజయవాడ సెప్టెంబర్‌ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అదే రోజు సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఈ లోపు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. మిలినియం మార్చ్‌ పిలుపుతో కొన్ని ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చలో విజయవాడను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేశాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img