Monday, August 15, 2022
Monday, August 15, 2022

హోదాపై మళ్ళీ మ..మ

ప్రధానికి సీఎం జగన్‌ వినతిపత్రం
విభజనతో దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనను పురస్కరించుకుని ప్రతిపక్షాలు పెద్దఎత్తున నిరసనకు దిగడంతో, సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి వీడ్కోలు పలుకుతూ, అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పెండిరగ్‌ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞాపన పత్రం అందజేశారు. దానిలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి తాను ఆ డిమాండ్‌ను వదలిపెట్టలేదని అనిపించుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి చెందిన పార్లమెంటు సభ్యులను ఎక్కువమందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని…ఎన్నికల సందర్భంగా జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి 22 మంది వైసీపీ ఎంపీలను రాష్ట్ర ప్రజలు గెలిపించగా, జగన్‌ కేంద్రంపై పోరాటం చేయకపోగా, కేంద్రానికి సాగిలపడుతూ… అడుగుతూ ఉండడం తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేసిన విషయం తెల్సిందే. దీనిలో భాగంగానే సోమవారం ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి తన విజ్ఞాపన పత్రంలో కీలకమైన ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి అడిగానని అనిపించుకున్నారు. అది కూడా విజ్ఞాపన పత్రంలో చివరి అంశం కావడం గమనార్హం. ఇక దీనితో పాటు రీసోర్సు గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని, తెలంగాణ డిస్కంలనుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేని కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని, భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలని, ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని సీఎం కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img