Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అందుకే పర్యటించలేదు..

చంద్రబాబు సంస్కారానికి నా నమస్కరం : సీఎం జగన్‌

నాయకుడు అనేవాడికి.. ప్రజలకు జరగాల్సిన మంచి సరైన పద్దతిలో, అందరికి అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం ముఖ్యం.. అంతేతప్ప.. బాధితుల దగ్గరకు వెళ్లి డ్రామాలు చేయడం కాదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణనష్టాన్ని దాచిపెట్టలేదని చెప్పారు. శుక్రవారం సభలో ఆయన మాట్లాడుతూ బాధితులకు సాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదన్నారు. ఆకాశానికి చిల్లుపడిరదా అన్నట్లు వర్షం పడిరదని, వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేశామని చెప్పారు. ‘‘ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు నాకు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారు. ముఖ్యమంత్రి వస్తున్నారని.. అందుకోసం ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అంత బిజీ అవుతారు. వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి సీఎం పర్యటన మీద ఫోకస్‌ పెడతారు. ఫలితంగా సహాయక చర్యలు, కార్యక్రమాలు ఆగిపోయి.. సీఎం చుట్టూ జిల్లా యంత్రాంగం, మీడియా, హడావుడి తప్ప.. పనులు జరగవు అని సీనియర్‌ అధికారులు నాకు తెలిపారు. వారి మాటలు వాస్తవం అనిపించాయి. అందుకే నాకు వెళ్లాలని ఉన్నా.. కూడా వెళ్లలేదు. నా పర్యటన నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు అని ఆగాను’’ అని చెప్పారు. వరదల వల్ల మూడు జిల్లాలకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. పింఛా ప్రాజెక్ట్‌ ఔట్‌ ఫ్లో సామర్థ్యం కంటే.. మూడు రెట్లు ఎక్కువగా ఇన్‌ఫ్లో వచ్చిందన్నారు. తిరుమల, తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. 2, 3 గంటల వ్యవధిలోనే వరద వచ్చి చేరిందన్నారు.ఓ బస్సు వరదలో చిక్కుకోవడంతో ప్రాణనష్టం జరిగిందని సీఎం జగన్‌ అన్నారు. సగటున 10.7 సెం.మీ వర్షపాతం నమోదైందని, వరద ఉధృతికి ప్రాజెక్టుల కట్టలు తెగిపోయాయన్నారు. పీలేరు, రాయచోటిలో అధిక వర్షపాతం నమోదైందన్నారు. అనూహ్యంగా వరద వచ్చిందని, ఏడాది మొత్తం కురిసిన వర్షాలకు కూడా.. పూర్తిగా నిండని జలాశయాలు ఉన్నాయని.. రెండురోజుల వర్షానికే జలాశయాలు నిండాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అర్థరాత్రి కూడా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైందని, 900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. ప్రతిపక్షాలు వరదల్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా.. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయన్నారు.
‘‘గాల్లోనే వచ్చి.. గాల్లోనే కలిసి పోతారు..అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో నాయకుడు అనేవాడు జనాల దగ్గరకు వెళ్లి.. వారితో మాట్లాడి.. ధైర్యం చెప్పి.. మీకు నేనున్నాను అనే నమ్మకం కలిగించాలి తప్ప. ఇలా వ్యక్తిగత విద్వేషాన్ని వెళ్లగక్కకూడదు. ఈ విషయంలో చంద్రబాబు సంస్కారానికి నా నమస్కరం’’ అని సీఎం ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img