Friday, April 19, 2024
Friday, April 19, 2024

అరెస్ట్‌ చేయకుండా ఆపండి

ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతించండి
న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలి
సీబీఐ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్‌ రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెల 10వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. దీంతో సీబీఐ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎంపీ అవినాశ్‌ రెడ్డి గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.160 సీఆర్‌పీసీ కింద నోటీస్‌లు ఇచ్చారు కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని హైకోర్టులో ఆయన రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు తనను చేసే విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసేలా అనుమతి ఇవ్వాలని, న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు. వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్‌ చేయలేదని, ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాశ్‌ రెడ్డి గుర్తు చేశారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ కొనసాగుతోందని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని పిటీషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని అవినాశ్‌ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని, అదే కోణంలో విచారణ చేస్తున్నారని ఎంపీ ఆక్షేపించారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని, తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాశ్‌ రెడ్డి తెలిపారు. సీబీఐ అధికారులు తొలుత ఈ నెల 6వ తేదీన ఎంపీ అవినాశ్‌రెడ్డిని హైదరాబాదుకు, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని కడప సెంట్రల్‌ జైలు వద్దకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తండ్రీ కొడుకులను ఒకేరోజు విచారణకు పిలవడం వైసీపీలో సంచలనం రేకెత్తించింది. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉండటం వలన సోమవారం విచారణకు హాజరుకాలేనని ఎంపీ సీబీఐ అధికారులకు లేఖ రూపంలో తెలియజేశారు. దీనికి ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ సీబీఐ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు తండ్రీ కొడుకుల విచారణ తేదీలను సీబీఐ మార్పు చేసింది. ఈ మేరకు 10న హైదరాబాదులో విచారణకు కొడుకు వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని, 12న కడపలో తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే 160 సీఆర్‌పీసీ కింద ఈ నోటీసులు జారీ కావడంతో అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళనతో అవినాశ్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img