Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆయుష్మాన్‌ భారత్‌ను సీఎం జగన్‌ ఆరోగ్య శ్రీగా మార్చారు: జేపీ నడ్డా

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు విజయవాడలో శక్తి ప్రముఖులను ఉద్దేశించి అన్నారు. బూత్‌ స్థాయి కమిటీల నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేయాలని.. ఈ కమిటీల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన సూచించారు. విజయవాడలో నిర్వహించిన శక్తికేంద్ర ప్రముఖులు, కార్యకర్తల సమావేశంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ అనే పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందన్న నడ్డా.. ఇక్కడున్న సీఎం జగన్‌ దాన్ని ఆరోగ్య శ్రీగా మార్చారన్నారు. ఆరోగ్య శ్రీ అనేది జగన్‌ కార్యక్రమం కాదు.. ఇది కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ అని నడ్డా తెలిపారు. ఇది ఆయుష్మాన్‌ భారత్‌గా కొనసాగితే.. ఏపీ ప్రజలు పొరుగు రాష్ట్రాలకు సైతం వెళ్లి రూ.5 లక్షల వరకు ఆరోగ్య సేవలు పొందొచ్చన్నారు. అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ ముందుకు నడిచే పార్టీ బీజేపీ మాత్రమే అని నడ్డా తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ కుటుంబ పార్టీలతో పోరాటం చేస్తోందని నడ్డా తెలిపారు. వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ అన్ని కుటుంబ పార్టీలేనని ఆయన ఆరోపించారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఇండియన్‌ ఎవరూ లేరని నడ్డా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు లండన్‌ నుంచి మాట్లాడుతున్నారన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ, కుటుంబ ప్రమేయం లేని పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. రాజనీతి అనే పదానికి ప్రధాని మోదీ సరికొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. తాను రాజ్యసభ సభ్యుణ్ని అవుతానని లక్ష్మణ్‌కు చివరి వరకూ తెలియదన్నారు. రాష్ట్రంలో 10 వేలకుపైగా శక్తి కేంద్రాలు ఉండగా.. 8 వేలకుపైగా శక్తి కేంద్ర ప్రముఖుల నియామకం పూర్తయ్యిందన్న నడ్డా.. రాబోయే రెండు నెలల్లో మిగిలిన శక్తి కేంద్రాల ప్రముఖులను నియమాకం పూర్తి అవుతుందని తనకు సమాచారం ఉందన్నారు. పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటు నెల రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించారు. అన్ని వర్గాలకు చెందిన పార్టీ బీజేపీ అనే భావన వచ్చేలా.. అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం పార్టీ బూత్‌ కమిటీల్లో ఉండాలని నడ్డా సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img