Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఈ‘సారీ’ రాలేను


సీబీఐకి ఎంపీ అవినాశ్‌ రెడ్డి మళ్లీ లేఖ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి మరోసారి సీబీఐకి లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యం దృష్ట్యా సోమవారం విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ అయిన తర్వాతనే విచారణకు వస్తానని తెలిపారు. కాగా, ఇప్పటికే రెండుసార్లు (ఈనెల 16, 19న) సీబీఐ విచారణకు అవినాశ్‌ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో ఈ నెల 22న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ వాట్సప్‌లో సీబీఐ నోటీసు పంపింది. వాస్తవానికి ఆయన శుక్రవారమే సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన అవినాశ్‌రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని సమాచారం వచ్చిందంటూ మార్గమధ్యలోనే రూటు మార్చుకుని వెళ్లారు. ఆయన న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఈ సమాచారం అందించారు. అవినాశ్‌రెడ్డి తల్లిని పులివెందుల నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి తీసుకురావడంతో శుక్రవారం నుంచి ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి నోటీసు ఇవ్వగా, ఈసారి కూడా రాలేనంటూ లేఖ పంపారు. అయితే దీనిపై సీబీఐ తీవ్రంగా స్పందిస్తూ, సోమవారం ఎట్టిపరిస్థితుల్లో హాజరుకావాల్సిందేనంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img