Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యోగం రాదన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ప్రభుత్వం జాబ్‌ క్యాలెండరులో టీచరు పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో ఇక ఉద్యోగం రాదని, తమ ఇద్దరు అక్కలు, చెల్లెలు వివాహం కోసం చేసిన అప్పులు తీర్చలేనని భావించిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లా గూడూరు మండలం పర్లగ్రామంలో చోటు చేసుకుంది. పర్లగ్రామానికి చెందిన రమేష్‌ (22) డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ఇంతకుముందే టీటీసీ పూర్తి చేశాడు. డీఎస్సీ కోసం కర్నూలులో మూడు సంవత్సరాలుగా కోచింగ్‌ తీసుకుంటూ సిద్ధమై నాడు. రాష్ట్రప్రభుత్వం జున్‌ 18న ప్రకటించిన జాబ్‌క్యాలెండర్‌లో డీఎస్సీ ప్రస్తావన

లేకపోవడంతో ఇప్పట్లో ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న మానసిక ఆందోళనను తట్టుకోలేక బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని మృతి చెంది నట్లు విద్యార్థి,యువజన సంఘాల నాయకులు తెలిపారు. రమేష్‌కు ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు. తల్లిదండ్రులు అప్పులు చేసి వారి వివాహాలు చేశారు. కాగా మృతుని తండ్రి సుంకన్న మాత్రం అప్పులు ఉన్నాయని, దీంతో తన కుమారుడు మాససిక వేధనతో బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు నాగులాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: కర్నూలుజిల్లా పర్ల గ్రామానికి చెందిన నిరుద్యోగి రమేష్‌ ఆత్మహత్యకు జగన్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండు చేస్తూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని దాసరిభవన్‌ వద్ద విద్యార్థి,యువజన సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రవిచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్‌ ప్రకటనలో 2.30 లక్షల పోస్టులు కల్పించని కారణంగానే నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.ఇది ముమ్మాటికి జగన్‌ ప్రభుత్వం హత్యేనన్నారు. రమేష్‌ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ ధర్నాలో శివారెడ్డి(ఏఐఎస్‌ఎఫ్‌), ఐ.రాజేష్‌ (పీడీఎస్‌యూ), సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img