Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉపాధ్యాయ ఆరోగ్య కార్డుల సమస్యలు పరిష్కరించండి: ఎస్టీయూ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల ఆరోగ్య కార్డులను తక్షణమే పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిశ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న డిమాండ్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హేమేంద్రరావు నేతృత్వాన తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సమావేశపు భవనంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల రిఫరల్‌ హాస్పిటల్‌ యాజమాన్య కమిటీ సభ్యుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. దీనికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ తదితర సంఘాల నాయకులు హాజర య్యారు. ఎస్టీయూ నేతలు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అత్యవసర చికిత్సల కోసం వెళ్లినప్పుడు రిఫరల్‌ ఆస్పత్రులు ఎట్టి పరిస్థితులలోనూ వైద్యం నిరాకరించకూడదని, అలాంటి రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు జిల్లా స్థాయిలో రూ.50 వేల వరకు మాత్రమే పరిమితి ఉన్నందున, అమరావతిలో బిల్లుల భారం ఎక్కువైందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాస్థాయి పరిమితిని లక్ష రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. దశాబ్ద కాలంగా ఉన్నటువంటి నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ గరిష్ట పరిమితిని రూ.2 లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలన్నారు. గుండె ఆపరేషన్‌, రోడ్డు ప్రమాదాల కేసుల విషయంలో అత్యవసర సమయాల్లో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతులు సకాలంలో రావడంలేదని, వాటికోసం వేచి చూడకుండా చికిత్సలు చేయించేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. తక్షణమే అన్ని రకాల ముందస్తు వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఖర్చులనూ ఆరోగ్య కార్డుల కింద కవర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు అందని ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు తక్షణమే నూతన కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రిఫరల్‌ ఆసుపత్రులకుగాను ఇప్పటివరకు దాదాపు రూ.1,600 కోట్ల బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులక వైద్యం దూరమవుతుందన్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్‌ అధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులతో సమన్వయ సమావేశాలు క్రమంగా జరిగేలా ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img