బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మార్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారింది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం గురువారం ఉదయం మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం సాయంత్రం తమిళనాడులోని కారైకల్, ఏపీలోని శ్రీహరికోట మధ్య కడలూరు సమీపంలో తుపానుగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నాటికి ఇది బలహీనపడి వాయుగుండంగా మారి అనంతపురం జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తుపాన్ ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో రెండురోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు కోరారు. కాగా దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.