Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఏపీలో విస్తారంగా వర్షాలు

రుతుపవనాల గమనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం గరికిపాలెంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 122.5 మి.మీ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 110.5 మి.మీల వర్షం కురిసింది. మరోవైపు ఉత్తర, దక్షిణ కోస్తాలోని తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడిరచింది. అటు రాయలసీమలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచి వరద పోటు పెరగడంతో పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ అమ్మవారి ఆలయంలోకి భారీగా నీరు చేరడంతో దర్శనాలను నిలిపివేశారు. చినరమణయ్యపేట- దండంగి మధ్య సీతపల్లి వాగుపైకి వరద నీరు చేరడంతో దేవీపట్నం వైపు రాకపోకలు నిలిపివేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీవర్షాలు కురుస్తుండగా… ఎన్టీఆర్‌, తిరుపతి, నంద్యాల, పల్నాడు, వైయస్‌ఆర్‌, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img