Friday, April 19, 2024
Friday, April 19, 2024

కళాతపస్వి కె విశ్వనాథ్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన ఇరురాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్‌ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు కళామతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది. విశ్వనాథ్‌ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌ రావు, జగన్‌ మోహన్‌ రెడ్డి తమ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యముగా మలిచిన అరుదైన దర్శకుడు కె.విశ్వనాథ్‌ అని సిఎం కేసీఆర్‌ అన్నారు. గతంలో కె.విశ్వనాథ్‌ గారి ఆరోగ్యం బాగాలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యం పై తమ మధ్య జరిగిన చర్చను కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు.భారతీయ సామాజిక సంస్కృతీ సంప్రదాయ విలువలకు తన సినిమాలో పెద్ద పీట వేశారని అన్నారు.
సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మక గా సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్‌ అంటూ కొనియాడారు. దాదా సాహెబ్‌ ఫాల్కే , రఘుపతి వెంకయ్య వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు ఆయన దర్శక ప్రతిభకు కలికి తురాయిగా నిలిచాయని చెప్పారు. తెలుగు సినిమా వున్నన్ని రోజులు కే. విశ్వనాథ్‌ పేరు నిలిచి ఉంటుందన్నారు సీఎం కేసీఆర్‌..
వైఎస్‌ జగన్‌ .. కళాతపస్వి మృతితో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగులో ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ సినిమా డైరెక్టర్లలో విశ్వనాథ్‌ అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. దిగ్గజ దర్శకుడు తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు గుర్తింపు తెచ్చారని కొనియాడారు.
‘‘విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన చలనచిత్రాలు సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, భారతీయ కళల, హస్తకళలకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా విలువలతో కూడినవిగా ఉండేవని.. ముఖ్యంగా సామాజిక అంశాల చుట్టూ తిరుగుతూ .. సినిమాలు సామజిక చైతన్యానికి మార్గం సుగమం చేశాయన్నారు సీఎం జగన్‌. కె విశ్వనాథ్‌ నిష్క్రమణ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని.. ఆయన మిగిల్చిన శూన్యాన్ని ఎప్పటికీ పూరించలేమని వైఎస్‌ జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img