Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గ్రామీణ కష్టజీవులకు సంక్షేమంతో అభివృద్ధి కావాలి

. జాతీయ సంపదలో వాటా కోసం పోరాడదాం
. ఆగస్టు చివరి వారంలో బాపట్లలో సంఘం రాష్ట్ర మహాసభ
. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులకు జల్లి విల్సన్‌, ఆవుల శేఖర్‌ పిలుపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కష్టజీవులకు సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఆత్మగౌరవం, జాతీయ సంపదలో వాటా కోసం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులు పాటుపడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. సమావేశానికి జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఏ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినా పేదల ఆత్మగౌరవం కోసం పాటు పడటం లేదని, ఆత్మగౌరవం దక్కాలంటే భూమి పంపిణీ చేయాలని, అలాంటి ధ్యాస ప్రభుత్వాలకు లేదని అన్నారు. జాతీయ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం వల్ల పేదల శాతం రోజురోజుకు పెరిగిపోతోందని, మన ఉద్యమాలను సంక్షేమం కోసమే కాకుండా, గ్రామీణ కష్టజీవుల భవిష్యత్‌ తరాల బాగు కోసం, వారి అభివృద్ధి కోసం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుతోనే పేదల జీవన విధానం మారబోదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టజీవుల దగ్గరకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వంతో పాటు గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి సంఘంలో వారిని భాగస్వాములు చేయాలని, ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మహాసభలను రాబోయే మూడు నెలల పాటు చాలా ఘనంగా నిర్వహించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతతత్వ పోకడలకు వ్యతిరేకంగా జరిగే సీపీఐ, సీపీఎం ప్రచారభేరిలో వ్యవసాయ కార్మిక సంఘం నాయ కులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 22వ మహాసభలు బాపట్లలో ఆగస్టు చివరి వారంలో నిర్వహించాలని, 10 వేల మంది గ్రామీణ కష్టజీవులతో ప్రదర్శన, భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను అమలు చేసి గ్రామీణ కష్టజీవులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మే మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, రెవెన్యూ శాఖ మంత్రికి వినతిపత్రాలు ఇవ్వాలని సమావేశం తీర్మానించిందన్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్ర దేశ్‌ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు, ఏఐటీ యూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య హాజరై ప్రసంగించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఆర్‌.వెంకట్రావు, బి.కేశవరెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, చిలుకూరి వెంకటేశ్వరరావు, కాబోతు ఈశ్వరరావు, లండ వెంకట్రావు, కలిశెట్టి వెంకట్రావు, దగాని సంగీతరావు, టి.కిష్టప్ప, మేరుగు విజయ్‌ కుమార్‌, కృష్ణయ్య, నాగుల్‌ మీరా, శ్రీధర్‌, సుబ్బరాయుడు, ఎస్‌.డి.మౌలాలి, ఉప్పె నరసింహారావు, శ్రీను, కలింగ్‌ లక్ష్మణ్‌, రమణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img