Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చట్టసభలో ప్రజాసమస్యలపై మాట్లాడేవారే లేరు?

. సామాన్యులు ఎన్నికయితేనే ప్రజాస్వామ్యానికి మనుగడ
. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీలైతే పెద్దల సభ గందరగోళమే
. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌
. అట్టహాసంగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు

విశాలాంధ్ర`అనంతపురం అర్బన్‌ : అటు పార్లమెంటు, ఇటు శాసనసభలో మతోన్మాదులు, కార్పొరేట్‌లు 90 శాతం మంది ఉన్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడే నాయకుడే కరువయ్యాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అన్నారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ కార్యక్రమం బుధవారం జిల్లా కేంద్రంలో అట్టహాసంగా సాగింది. తొలుత గుత్తి రోడ్డు చలమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఇతర ప్రజా సంఘాల అధ్వర్యంలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జల్లి విల్సన్‌తో పాటు ఎమ్మెల్సీలు వెంకటేశ్వర రావు, షాజ్జో, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్‌, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి, పోతుల నాగరాజు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి జోసెఫ్‌ సుధీర్‌బాబు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి గోగమూర్తి, ఇన్సాఫ్‌ రాష్ట్ర నాయకుడు జాఫర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర మాజీ నాయకుడు వేమయ్య యాదవ్‌, రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రాంభూపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయుల, నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కారం కావాలంటే ప్రజాసేవ పట్ల అంకిత భావం, క్రమశిక్షణ కలిగిన నాయకత్వం అవసరమన్నారు. పార్లమెంటు, శాసనసభ, శాసన మండలిలో మతోన్మాదులు, కోటీశ్వరులు, బడా పారిశ్రామిక వేత్తలు ప్రజాప్రతినిధులుగా కూర్చొని ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్వార్థపరులకు దేశ పురోగతి, ప్రజాసమస్యలు ఏమాత్రం పట్టవని విమర్శించారు. శాసన మండలిలో ప్రజావాణిని వినిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక బృహత్తర అవకాశమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, ఆయా రంగాల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి, ప్రాంతాల మధ్య అభివృద్ధిని కాంక్షించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని జల్లి విల్సన్‌ పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీగా కత్తి నరసింహారెడ్డి గత ఆరేళ్లుగా నియోజకవర్గ పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. సామాజిక న్యాయం పేరుతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అణగారిన, బడుగు బలహీనర్గాలకు అన్యాయం చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అగ్రవర్ణాలకే అగ్రతాంబూలం ఇస్తోందని విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులు, పట్టభద్రులు, నిరుద్యోగులు మేధావులు, పోరాట యోధులను గుర్తించి ఎమ్మెల్సీలుగా ఎన్నుకోవాలని సూచించారు. ఇప్పటికే అనేక సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయని, కేంద్రం నూతన విద్య విధానాన్ని తీసుకురావడం వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. విద్యారంగంపై ఏమాత్రం పరిజ్ఞానం లేని కమిషనర్లు, ముఖ్యకార్యదర్శులు ఉండటంతోనే సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయని తూర్పారబట్టారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్సీలైతే మండలిలో ప్రజా సమస్యలను వాయిదా వేస్తూ చర్చలు లేకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తారని విమర్శించారు. గతంలో తనతోపాటు ఎమ్మెల్సీగా గేయానంద్‌, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు మండలిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, రైతులు, కూలీలు, చేతివృత్తిదారుల సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన వైఖరితో అన్ని వర్గాల ప్రజల వాణిని వినిపిస్తూ పోరాడామని జల్లి విల్సన్‌ గుర్తు చేశారు. ఆ క్రమంలోనే పీడీఎఫ్‌ అభ్యర్థులను శాసన మండలికి పంపించి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, కూలీల సమస్యలపై ఉద్యమ గళం వినిపించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుర్మార్గాలు, అన్యాయా లను వ్యతిరేకించాలని పట్టభద్రులు, ఉపాధ్యాయులను కోరారు. వీరి గెలుపు కోసం ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నామినేషన్‌కు వెళ్లారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజినేయులు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌ బాబు, రాష్ట్ర మాజీ నాయకుడు నారాయణ స్వామి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లికార్జున, కర్నూలు జిల్లా నాయకుడు గిడ్డయ్య, నంద్యాల జిల్లా నాయకుడు రంగా నాయుడు, కడప జిల్లా నాయకుడు నాగ సుబ్బారెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు శ్రీరాములు, రమణ, రాజేష్‌ గౌడ్‌, మల్లికార్జున, కుల్లాయ్‌ స్వామి, చిరంజీవి, సంతోష్‌ కుమార్‌, ఆనంద్‌ కుమార్‌, ఆరు జిల్లాల ఎస్టీయూ, యూటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img