Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జగన్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఎంపీ రఘురామకు ఎదురు దెబ్బ!

జగన్‌ సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రుషికొండపై టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటి విధించిన స్టే ఎత్తివేయాలని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. రుషికొండలో నిర్మాణాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపింది. తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయొద్దన్న సుప్రీం కోర్టు.. కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదంది. రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్‌ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగం గందరగోళంలో ఉందని.. హైకోర్టు రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది.ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచన చేసింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు కల్పించడంతో ప్రభుత్వానికి రిలీఫ్‌ దక్కింది. నర్సాపురం ఎంపీ రఘురామ గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అలాగే రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమించింది. నెల రోజుల్లో నివేదిక అందించాలని ఎన్జీటీ కమిటీని ఆదేశించి.. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి తవ్వకాలూ జరపరాదని ఎన్జీటీ ప్రభుత్వానికి చెప్పింది.అంతేకాదు రఘురామ గతేడాది ఎన్జీటీ చైర్మన్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌కు దీనిపై లేఖ రాశారు. రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన జరుగుతోందని.. అక్కడ అక్రమ తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. పర్యాటక శాఖ, పట్టణ మున్సిపల్‌ శాఖ అమలులో ఉన్న పర్యావరణ అనుమతులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం విశాఖ రుషికొండ తవ్వకాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ ధర్మాసనం ఇచ్చిన స్టేను కోర్టులో సవాల్‌ చేసి.. పర్యావరణ అనుమతులన్నీ పొందిన తర్వాతే రుషికొండలో తవ్వకాలను చేపట్టినట్లు తెలిపింది. పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా తవ్వకాలు, నిర్మాణాలు చేపడతామని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఇప్పుడు కోర్టు విచారణ జరిపి తీర్పును వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img