Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తిరుపతి రుయాలో అమానవీయం.. బైకుపైనే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి!

తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అప్పటికే కొడుకు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రికి అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలు మరింత కుమిలిపోయేలా చేశాయి. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రుయా అంబులెన్సు డ్రైవర్లు.. కేవలం 90 కిలోమీటర్ల దూరానికి రూ.10 వేలు అడిగి దౌర్జన్యం చేశారు. అంతేకాదు.. ఉచిత అంబులెన్సు వచ్చినా డ్రైవర్‌ ను బెదిరించి తన్ని తరిమేశారు. దీంతో ఆ తండ్రి తన కన్నకొడుకు మృతదేహాన్ని విషణ్ణ వదనంతోనే బైకుపై తీసుకెళ్లాల్సి వచ్చింది.అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జైశ్వ అనే చిన్నారి ఇటీవల అనారోగ్యానికి గురికాగా.. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలోనే మూత్రపిండాలు, కాలేయం దెబ్బతిన్నాయి. పనిచేయడం మానేశాయి. దీంతో నిన్న రాత్రి 11 గంటలకు బాలుడు కన్నుమూశాడు. అయితే, కొడుకు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆ తండ్రి బయట ఉన్న అంబులెన్సు డ్రైవర్లను అడిగాడు. అంబులెన్సు డ్రైవర్లు రూ.10 వేలు ఇస్తేనే వస్తామంటూ డిమాండ్‌ చేయడంతో తన వల్ల కాదని ఆ తండ్రి చేతులెత్తేశాడు. గ్రామంలోని బంధువులకు ఇదే విషయాన్ని చెప్పడంతో.. ఉచిత అంబులెన్సు సర్వీసును పంపారు. ఆసుపత్రికి వచ్చిన ఉచిత అంబులెన్సు డ్రైవర్‌ ను రుయా ఆసుపత్రి వద్ద మాఫియాగా ఏర్పడిన అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టారు. అక్కడి నుంచి పంపించేశారు. తమ అంబులెన్సుల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ అరాచకానికి తెరదీశారు. దీంతో ఆ తండ్రి చేసేదేమీ లేక బండిపైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయాడు. ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయని, అయినా కూడా అంబులెన్సు డ్రైవర్ల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img