Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశ రాజకీయాల్లో ప్రమాదకర పరిస్థితి

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తున్న మోదీ సర్కారు
2024లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు
31మంది ఎంపీలు ఉన్నా ప్రత్యేక హోదా సాధనలో వైసీపీ విఫలం
రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్న జగన్‌
పాలకుల దుర్మార్గపు విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
సీపీఐ జాతీయ మహాసభల జయప్రదానికి సహకరించాలి
సీపీఐ విశాలాంధ్ర శాఖ మహాసభలో రామకృష్ణ

విశాలాంధ్ర`విజయవాడ : దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. పాలకులు అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలు, వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి చైతన్యపరచాల్సిన బాధ్యత విశాలాంధ్రపై ఉందని చెప్పారు. సీపీఐ విశా లాంధ్ర శాఖ మహాసభ శుక్రవారం చంద్రం బిల్డింగ్స్‌లో విశాలాంధ్ర ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యదర్శి ఎం.మురళీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా కె.రామకృష్ణ, గౌరవ అతిథిగా విశాలాంధ్ర విజ్ఞాన సమితి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ హాజరయ్యారు. విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు అరుణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ అన్ని రంగాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడిరదని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని, కోట్లాది మంది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోయారన్నారు. సామ్రాజ్యవాద దేశాలు కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యాయని చెప్పారు. చైనా, క్యూబా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించాయని, ఆయా దేశాల్లో విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. భారతదేశంలో కరోనాను ఎదుర్కొనే విషయంలో మోదీ ప్రభుత్వం అశాస్త్రీయ విధానాలతో ప్రజల ప్రాణాలను బలితీసుకుందని విమర్శించారు. కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను అమలు చేస్తోందని, ఇందులో భాగంగానే జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు చేశారని, అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టారని, ముస్లింలను ద్వితీయ పౌరులుగా పరిగణించేందుకు ఎన్నార్సీ, సీఏఏ తీసుకొచ్చారని, ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఏకంగా స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ భగత్‌సింగ్‌ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు హెగ్డేవార్‌ జీవితాన్ని పాఠంగా చేర్చడం బీజేపీ దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అని అన్నారు. బీజేపీ నాయకులు మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏకంగా రాజ్యాంగాన్ని కూడా మార్చివేస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవైపు దేశంలోని సాధారణ ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పెరిగిపోతున్నాయని, మరోవైపు కార్పొరేట్ల ఆస్తులు పెరిగిపోతున్నాయని, ఇందుకు మోదీ పాలనే కారణమని చెప్పారు. రాష్ట్రంలో తనకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానని చెప్పిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు కలిపి 31 మంది ఉన్నా కనీసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కీలకమని తెలిసినా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయిం చాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేయకుండా బేషరతుగా బీజేపీకి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై విజయవాడలో అక్టోబర్‌ 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభల జయప్రదానికి విశాలాంధ్ర సీపీఐ శాఖ, ఎంప్లాయీస్‌ యూనియన్‌, ఉద్యోగులు తమవంతు సహకారం అందించాలని కోరారు. కూన అజయ్‌బాబు మాట్లాడుతూ విశాలాంధ్ర జర్నలిస్టులకు కమ్యూనిస్టు పార్టీ దృక్పథం ఉండాలని, అది వార్తల్లో ప్రతిబింబించాలనే లక్ష్యంతో సీపీఐ శాఖ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ శాఖ ద్వారా జర్నలిస్టులకు నిరంతరం రాజకీయ చైతన్యం కల్పించాల్సి ఉందన్నారు. తొలుత సంతాప తీర్మానాన్ని ్జ చావా రవి ప్రవేశపెట్టారు. సీపీఐ విశాలాంధ్ర శాఖ కార్యదర్శి పి.మధుసూధనరావు కార్యదర్శి నివేదికను సమర్పించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రానాయక్‌, కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గేయాలు ఆలపించారు.
నూతన కమిటీ ఎన్నిక : సీపీఐ విశాలాంధ్ర శాఖ కార్యదర్శిగా పి.మధుసూదనరావు, సహాయ కార్యదర్శిగా వి.రమేశ్‌, కార్యవర్గ సభ్యులుగా ఎం.మురళీకృష్ణ, ఎస్‌కే సూర్యనారాయణ, ఎం.బొర్రయ్య, కె.వెంకటస్వామి, ఎం.రామారావు, ఇ.రొమిలా, టి.యోగితను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img