Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్‌ మృతి

చెన్నై :
ప్రముఖ నటుడు, విమర్శకుడు కత్తిమహేశ్‌ శనివారం మధ్యాహ్నం మృతిచెందారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. తొలుత ఆయనకు ప్రాణాపాయం లేదన్నా ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో మహేశ్‌ చనిపోయారని వైద్యులు చెప్పారు. ఈ వార్త విని ఆయన అభిమానులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగినప్పుడు మహేశ్‌ కారు నుజ్జునుజ్జు అయింది. ఆయన సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా పరిస్థితి విషయమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలోకి తరలించారు. తల, కంటి భాగాల్లో శస్త్రచికిత్స కూడా జరిగింది. కత్తి మహేష్‌ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.17 లక్షల ఆర్థికసాయం

అందించింది. మహేశ్‌ చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. ఉన్నత విద్యను హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అభ్యసించారు. చిత్రదర్శకుడు కావాలని అనేక ప్రయత్నాలు చేశారు. 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్‌ రచించిన ‘ఊరు చివర ఇల్లు’ కథ ఆధారంగా లఘు చిత్రం తీశారు. ‘మిణుగురులు’ చిత్రానికి సహ`రచయితగా వ్యవహరించారు. నందు హీరోగా పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించినా, అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ‘హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ వంటి సినిమాలతో నటుడిగా అలరించాడు. టెలివిజన్‌ ఛానళ్లు, యూట్యూబ్‌ వేదికగా సినిమాల సమీక్ష చేసేవారు. ‘బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 1’లో కత్తి మహేశ్‌ పాల్గొన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. కొందరు యువహీరోలు సంతాపం ప్రకటించారు.
కత్తి మహేశ్‌ మరణం బాధాకరం
సినీ విశ్లేషకులు కత్తి మహేశ్‌ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. సినీ నటుడిగా, విమర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కత్తి మహేశ్‌ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. దళిత సమస్యలపై, సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించడం ఆయన ప్రత్యేకత అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img