Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిరుద్యోగుల గొంతు కోసిన జగన్‌ ప్రభుత్వం

ఏపీ ఉద్యోగ పోరాట సమితి నేతల ఆగ్రహం
19న ‘చలో విజయవాడ’కు పిలుపు
రేపు, ఎల్లుండి కలెక్టరేట్ల వద్ద నిరాహారదీక్షలు

విశాలాంధ్ర – కాకినాడ : ఉద్యోగాలు భర్తీ విషయంలో వైఎస్‌జగన్‌ ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి గొంతు కోసిందని ఆంద్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి నేతలు మండిపడ్డారు. సమితి అధ్వర్యంలో ఆదివారం స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.బాబీ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.రాజా అధ్యక్షతన నిరుద్యోగ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.జాన్సన్‌ బాబు, పీడీఎస్‌యు కార్యదర్శి గనీ రాజు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు రాజేష్‌, ఎస్‌ ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిన్నారి మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న 2,35,794 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌.. రెండేళ్ల తర్వాత కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిచడం దుర్మార్గమన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల ఉపాధ్యాయ ఖాళీల గురించి మాట్లాడక పోవడం సిగ్గుచేటన్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం నాడు ఈ ఏడాది 6500 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు ఇస్తానన్న సీఎం .. ఏళ్ల తరబడి కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులను నట్టేట ముంచారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గ్రూప్‌ వన్‌, గ్రూప్‌ టుకు సంబంధించి ఐదు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 36 పోస్టులు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, పలు జిల్లాల్లో ఖాళీగా ఉన్న 77వేల డైరెక్ట్‌ రిక్రూట్మెంట్‌ పోస్ట్‌లు భర్తీ చేయాలని డిమాండు చేశారు. రాష్ట్రానికి నూతన పరిశ్ర మల ఏర్పాటుకు ఊతమిచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు,. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ రద్దుచేసి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,794 పోస్టులకు నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండు చేశారు. నూతన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల కోరుతూ ఈ నెల 13 ,14 తేదీలలో కలెక్టర్‌ కార్యాలయాల వద్ద చేపట్టే రిలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని నిరుద్యోగులని కోరారు. ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వం స్పందిం చకుంటే 19వ తేదీన విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులను కలుపుకొని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు రవి, రాంప్రసాద్‌, భద్ర, జిల్లా అధ్యక్షులు సూరిబాబు, నాయకులు శివరాజు, మణికంఠ, సాయి, సాత్విక్‌, ఆకాంక్ష, డీవైఎఫ్‌ఐ నాయకులు పి వీరబాబు, సూర్య పవర్‌ మనోజ్‌, ఈశ్వర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img