Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ

గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు
క్రీడల, పర్యాటకశాఖ మంత్రి రోజా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు సిద్ధమవ్వాలని పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో సోమవారం పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ అధికారులతో రోజా సమీక్షించారు. పర్యాటక ప్రాజెక్టులలో భూసేకరణ పనులు, ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలను మంత్రికి అధికారులు వివరించారు. రోజా మాట్లాడుతూ, చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పర్యాటక పరంగా మరింతగా అభివృద్ధి చేయాలనేదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్దానంలో వుండాలని, ఆ దిశగా పర్యాటక రంగంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని చెప్పారు. కొండ ప్రాంతాలు, బస్సు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. వాటిని ఆధునీకరించడానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైపాడు బీచ్‌, కాళహస్తీ పర్యాటక ప్రదేశాలపై ఆధికారులతో చర్చించారు. సాంస్కృతిక శాఖకు సంబంధించి అరకు గిరిజన మ్యూజియం అభివృద్ధి పనులపై చర్చించారు. క్రీడా శాఖ అధికారులతో రాష్ట్రంలోని పాఠశాలల్లోని విద్యార్ధులకు జగనన్న క్రీడా పరికరాలను అందించే అంశాలపై చర్చించారు. ఈ సమీక్షలో పర్యాటక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ్‌, వీసీ ఎండీ కన్నబాబు, శాప్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img